పాట చిత్రీకరణకు ఏకంగా రూ. 5 కోట్లు ఖర్చు!
ముంబై: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రూ. 5 కోట్లు చేతిలో ఉంటే ఓ మంచి సినిమానే తీయొచ్చు. కానీ ఓ సినిమాలోని పాట చిత్రీకరణకే రూ. 5 కోట్లు ఖర్చు పెడితే సినిమా బడ్జెట్ ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చెప్రా ప్రధాన పాత్రలో యష్ రాజ్ ఫిలింస్ తెరకెక్కిస్తున్న 'ధూమ్-3' చిత్రంలో ఓ పాటకు ఏకంగా రూ. 5 కోట్లు ఖర్చు పెట్టారట.
ఇండియన్ సినిమా చరిత్రలో ఓ పాటకు ఇంత ఖర్చు పెట్టడం ఇదే తొలిసారి. కత్రినా, అమీర్‌లపై చిత్రీకరించిన ఈ పాటలో 200 మంది జిమ్నాస్టిక్ కళాకారులను అమెరికా నుంచి తీసుకొచ్చారట. కళ్లు చెదిరేలా వేసిన సెట్లో 20 రోజుల పాటు ఈ పాట చిత్రీకరించారని, సినిమాకు ఈ పాట హైలెట్ అవుతుందని అంటున్నారు.
ధూమ్, ధూమ్-2 చిత్రాలు భారీ విజయం సాధించి నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'ధూమ్-3' చిత్రంపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. పైగా అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఈచిత్రంలో నటిస్తుండటం కూడా మరో కారణం. . ఈచిత్రం క్రిస్‌మస్ సీజన్‌ను పురస్కరించుకుని డిసెంబర్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
భారీ యాక్షన్ సన్నివేశాలు, కళ్లు చెదిరే సాహసాలు ఈచిత్రంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. ధూమ్ చిత్రం మొదటి భాగంలో జాన్ అబ్రహం నటించగా....దానికి సీక్వెల్ గా వచ్చి ధూమ్-2 చిత్రంలో హృతి రోషన్ ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు అమీర్ ఖాన్ 'ధూమ్-3' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈచిత్రంలో కత్రినా కైఫ్ విలన్ పాత్రలో నటిస్తోంది. దీనిపై అమీర్ ఖాన్ స్పందిస్తూ....కత్రినా కైఫ్ విలన్ పాత్ర పోషించడం నా కెరీర్లో మరిచిపోలేని విషయమని చెప్పుకొచ్చారు. సినిమాలో కత్రినా చేసే సాహసాలు ఆకట్టుకునే విధంగా ఉండనున్నాయి. ధూమ్ 2లో జైదీక్షిత్, అలీ ఖాన్ పాత్రల్లో నటించిన ఉదయ్ చోప్రా, అభిషేక్ బచ్చన్...ధూమ్-3 చిత్రంలో కూడా దాదాపు అలాంటి పాత్రల్లోనే పోలీసు ఆఫీసర్లుగా నటించనున్నట్లు తెలుస్తోంది. వీరి పాత్రలు కూడా సినిమాలో ఎంతో కీలకం. చికాగో నేపథ్యంలో సినిమా స్టోరీ ఉంటుంది. అమీర్ ఖాన్ ఇందులో ఓ నేరస్తుడి పాత్రలో కనిపిస్తాడు. పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈచిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications












