తెలంగాణ, ఏపీ ఫిల్మ్‌చాంబర్ల లొల్లిపై దిల్ రాజు అలా!
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పడిన నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమ విషయం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వారే ఉండటంతో పరిశ్రమ హైదరాబాద్ నుండి వైజాగ్ తరలి పోయే అవకాశం ఉందనే ప్రచారం గత కొంత కాలంగా జరుగుతోంది.
అయితే పలువురు నిర్మాతలు, దర్శకులు, స్టార్స్ ఈ విషయమై స్పందిస్తూ......పరిశ్రమ ఎప్పటికీ హైదరాబాద్‌లోనే ఉంటుందని, రెండు రాష్ట్రాల్లో ఉన్నది తెలుగు వారే కాబట్టి హైదరాబాద్ కేంద్రంగా పరిశ్రమ కొనసాగుతుందని స్పష్టం చేసారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా పలు సందర్భాల్లో ఇదే విషయం స్పష్టం చేసారు.
అయితే కొందరు తెలంగాణ ప్రాంతానికి చెందిన నిర్మాతలు, దర్శకులు మాత్రం.....రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా పరిశ్రమ ఉండాల్సిందే అంటూ పట్టు బడుతున్నారు. అయితే వీరి వాదనతో దిల్ రాజు ఏకీభవించడం లేదు. ఇప్పటికే తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఉంది, ఏపీ ఫిల్మ్ చాంబర్ కూడా ఉంది. తెలుగు వారంతా ఒకే సినిమాలు చూస్తారు కాబట్టి రెండు రాష్ట్రాలకు కలిపి ఉమ్మడిగా 'తెలుగు ఫిల్మ్ చాంబర్' ఉండాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నారు.

సినిమా అనేది ఒక వ్యాపారం. ఇక్కడ డబ్బు నష్ట పోవాలని ఎవరూ కోరుకోరు. తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం యాక్టింగ్ స్కూల్స్, ఇతర ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. ఇక్కడ పరిశ్రమ అభివృద్ధికి నా వంతు సాయం చేస్తున్నాను. అయితే ప్రభుత్వ సహాయం కూడా అవసరం. నేను తెలంగాణ వారిని పట్టించుకోవడం లేదనే దాంట్లోవాస్తవం లేదు. నేను ప్రోత్సహించిన వారిలో హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి లాంటి వారు తెలంగాణ ప్రాంతం నుండి ఉన్నారు అని దిల్ రాజు చెబుతున్నారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు చేస్తున్న ఆందోళనపై ఆయన స్పందిస్తూ....'వారిలో చాలా మంది తమ పర్సనల్ ఎజెండాతో ఆందోళన చేస్తున్నారని, తెలుగు సినిమా అభివృద్ధి గురించి వారికి ఎలాంటి ఎజెండా లేదు అని ఆయన అభిప్రాయ పడ్డారు. పరిశ్రమను శాసిస్తున్న నలుగురు పెద్ద నిర్మాతల్లో దిల్ రాజు ఒకరని, వీరు థియేటర్లను గుప్పిట్లో పెట్టుకుని చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై దిల్ రాజు స్పందిస్తూ హైదరాబాద్‌లో నా కంట్రోల్‌లో 22 థియేటర్లు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం లీజు సిస్టం రద్దు చేయాలని నిర్ణయిస్తే అందుకు నేను సంతకం చేయడానికి సిద్ధమే అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











