పాద‘యాత్ర’ తర్వాత వైఎస్ఆర్ హీరో అయ్యారు: దిల్ రాజు
డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలోని ముఖ్య ఘట్టాలతో నిర్మిస్తున్నచిత్రం 'యాత్ర'. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో నటించారు. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించగా విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్లో నిర్మించింది. ఫిబ్రవరి 8న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో... దర్శక నిర్మాతలు నైజా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. 'యాత్ర మూవీ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఒక సెన్సేషన్. అందులోని ఎమోషన్స్, మూమెంట్స్ ఐడియాగా తీసుకుని ఈ చిత్రాన్ని చేశారు. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్. 'యాత్ర' రూపంలో ఒక మంచి సినిమా రాబోతోందనిపిస్తోందన్నారు.

రెండు రోజుల ముందే ఆన్ లైన్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఓవర్సీస్, ఏపీ, తెలంగాణలో మంచి ఓపెనింగ్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నైజాం, వైజాగ్ ఏరియాల్లో మా సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. వైఎస్ఆర్ పాద్ర యాత్ర గురించి అప్పట్లో టీవీల్లో, పేపర్లలో చూశాం. ఆ తర్వాత ఆయన జనాల్లో హీరో అయ్యాడు. రామారావుగారి తర్వాత పబ్లిక్‌లో అంత ఇమేజ్ క్రియేట్ అయింది ఆయనకే. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అని దిల్ రాజు తెలిపారు.
నిర్మాత విజయ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో పాలిటిక్స్ ఉంటాయి.. కానీ ఇది పొలిటికల్ మూవీ కాదు. ఈ సినిమా వెనక ఏ రాజకీయ పార్టీ లేదు. ఎలాంటి వివాదాలు లేవు. ఇది కేవలం కేవలం వైఎస్ఆర్ అభిమానులకు మాత్రమే కాదు ప్రతి సినీ అభిమాని చూడదగ్గ చిత్రమని తెలిపారు.
దర్శకుడు మహి వి రాఘవ్ మాట్లాడుతూ.. మనకు భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు, వేరే ఇష్టాలు ఉండొచ్చు. నేను ఒకరిని ఇష్టపడుతున్నానంటే దాని అర్థం మరొకరిని ద్వేషిస్తున్నట్లు కాదు. వైఎస్ఆర్ సినిమా చేస్తున్నాం. దయచేసి అగౌరవ పరచొద్దు అని తెలిపారు.


Click it and Unblock the Notifications











