'F3'కి సీక్వెల్ గా 'F4'.. అలా కనిపించి హింట్ ఇచ్చిన అనిల్ రావిపూడి!
ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలకు సీక్వెల్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు దర్శకనిర్మాతలు. అందులో భాగంగానే బాహుబలి తో మొదలైన ఈ ట్రెండ్ పుష్ప, కేజిఎఫ్ లాంటి సినిమాల దాకా కొనసాగింది. ఇక తెలుగులో F2 సినిమాకి సీక్వెల్ గా F3 సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే F3 సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే అవకాశం ఉందంటూ సినిమా ఆఖర్లో హింట్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

సినిమాకు సీక్వెల్
భార్యాభర్తల సరదా గిల్లికజ్జాలు నేపథ్యంలో F2 అనే సినిమా తెరకెక్కించారు అనిల్ రావిపూడి. విక్టరీ వెంకటేష్- తమన్నా, వరుణ్ తేజ్ - మెహ్రీన్ కౌర్ జంటగా తెరకెక్కిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, మిర్చి మాధవి, ప్రగతి, ప్రదీప్, అన్నపూర్ణ, వై విజయ కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాక కలెక్షన్ల వర్షం కూడా కురిపించిన ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తామని అప్పట్లోనే దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. దానికి తగ్గట్టుగానే F3 అనే సినిమా రూపొందించారు.

కడుపుబ్బ
ఈ F3 సినిమా కూడా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. F2 సినిమాలో కేవలం ఫన్, ఫ్రస్టేషన్ చూపించగా F3 సినిమాలో దానికి తోడు ఫైనాన్స్ కూడా చూపించారు. సినిమా చూసిన వారందరూ కడుపుబ్బ నవ్వుకున్నాం అనే కామెంట్లు చేస్తున్నారు. అయితే కొన్ని సినిమాలను కలగలిపి ఈ సినిమా చేసినట్లు ఉందని కొందరు చేస్తున్నా, సినిమా మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది అని విమర్శకులు చెబుతున్నారు. అయితే F3 సినిమా క్లైమాక్స్ లో సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే అవకాశాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి సూచించారు.

ఎండ్ కార్డ్ వేయడం లేదని
'F3' సినిమాతో ఫన్ ఫ్రాంచైజీకి ఎండ్ కార్డ్ వేయడం లేదని, దాన్ని కంటిన్యూ చేస్తున్నామని 'F3' ఎండ్ కార్డ్స్‌లో అనౌన్స్ చేశారు అనిల్ రావిపూడి. 'F3' క్లైమాక్స్‌లో కథ సుఖాంతం అయిన తర్వాత వెంకటేష్, వరుణ్ తేజ్ తమ కుటుంబాలు, ఇతర ఆర్టిస్టులు అందరూ కలిసి గోవా ప్రయాణం అవుతారు. ఓ బస్సులో అందరూ కలిసి బయలుదేరిన సమయంలో ఉన్నట్టుండి బస్ గోవా వెళ్లకుండా రూట్ మారుతుంది.

అనౌన్స్ చేశారు కానీ
ఇదేంటి? ఇలా జరిగింది అని హీరో హీరోయిన్లు, ఇతర ఆర్టిస్టులు ఆలోచిస్తూ ఉండగా... డ్రైవర్ సీట్ లో ప్రత్యక్షం అయిన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ జర్నీ గోవాకు కాదని చెబుతూ 'F 4' సినిమాని అనౌన్స్ చేశారు. ఇక F4 అని అనౌన్స్ చేశారు కానీ ఆ సినిమా ఇప్పట్లో ఉండే అవకాశం అయితే కనిపించడం లేదు.

ఇప్పట్లో లేనట్టే
ఎందుకంటే F3 తర్వాత బాలకృష్ణతో సినిమా చేయడానికి అనిల్ రావిపూడి రెడీ అవుతున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ కూడా వేర్వేరు సినిమాలతో బిజీగా ఉన్నారు. సో... 'F4' ఇప్పట్లో లేనట్టే. మరో రెండు మూడేళ్ల తర్వాత ఈ సినిమా సందడి చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











