'సింహా' ...రెండు టిపికల్ పాత్రల్లో బాలకృష్ణ
రెండు టిపికల్ పాత్రల్లో బాలకృష్ణ కనిపిస్తారు. అన్ని భావోద్వేగాలు ఆ పాత్రల్లో వుంటాయి అంటున్నారు 'సింహా' గురించి దర్శకుడు బోయపాటి శ్రీను. అలాగే ఈ చిత్రంలో ప్రేక్షకులు, అభిమానులు కొత్త బాలయ్యను చూస్తారు. ప్రతి అంశంలోనూ ఆయన గత చిత్రాల పాత్రలతో పోలిస్తే తప్పకుండా వేరియేషన్ కనిపిస్తుంది అని హామీ ఇస్తున్నారు. బాలయ్య మీసకట్టు, గెటప్‌లో వైవిధ్యం కనిపిస్తుంది. కథకు, ఆ చిత్రంలోని పాత్రకు అవసరమైన మీసకట్టు, గెటప్ అది. తప్పనిసరిగా కథ డిమాండ్ మేరకే పెట్టాం. ఇక ఆ గెటప్‌కు అందరి నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే ఇప్పటి వరకు బాలయ్య చేయని ఓ సరికొత్త కథాంశంతో ఈ సినిమా వుంటుంది. ఇది అందరూ ప్రతి సినిమాకు చెప్పే మాటే కాబట్టి కొత్తగా వుంటుంది అని చెప్పడం కొంచెం ఇబ్బందిగానే వుంది. కాని రేపు చిత్రం విడుదల తర్వాత ఈ మాట నిజమేనని ప్రేక్షకులు కూడా ఒప్పుకుంటారు.
'సింహా' అనే టైటిల్ కథకు, బాలయ్య ఇమేజ్‌కు సరిగ్గా సరిపోతుంది. ఈ సినిమాకు ఈ టైటిల్ తప్ప ఇంకేదీ యాప్ట్ కాదు. టైటిల్ లోని పవర్ సినిమాలో కూడా ఉంటుంది. ఫైనల్ గా నా దర్శకత్వంలో వచ్చిన గత రెండు చిత్రాల కన్నా చాలా పవర్ ఫుల్ గా, ఎమోషనల్‌గా వుంటాడు. భద్ర, తులసి తర్వాత వాటిని మించిన శక్తివంతమైన కథతోనే నా మూడో సినిమాను చేయాలనుకున్నాను. అలాంటి కథను ఎన్నుకొనే ఈ సినిమాను రూపొందించాను. సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుడు కూడా ఇదే ఫీలవుతాడని నా నమ్మకం అన్నారు. భద్ర, తులసి వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత శ్రీను దర్శకత్వంలో రూపొందిన హేట్రిక్ చిత్రం 'సింహా'. బాలకృష్ణ హీరోగా పరుచూరి కిరీటి నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నమిత, నయనతార హీరోయిన్స్ గా చేసారు.


Click it and Unblock the Notifications











