కోడి రామకృష్ణ ఇకలేరు: మాస్, క్లాస్ తేడా లేదు.. చిరు, బాలయ్య, రాజశేఖర్, అర్జున్‌కు సోలో హిట్లు!
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వందకుపైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన గొప్ప దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. ఇలాంటి అరుదైన ఘనతను దక్కించుకొన్న దర్శకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఒక తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ రంగాల్లో తనదైన ముద్రవేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి, బాలకృష్ణ, రాజశేఖర్, అర్జున్ లాంటి పలువురు హీరోలకు సోలో విజయాలను అందించారు. అగ్ర హీరోలతో ఆయన ప్రస్థానం..

చిరంజీవితో సినీ ప్రయాణం
దర్శకుడిగా కోడి రామకృష్ణ తన తొలిచిత్రాన్ని చిరంజీవితో ఇంట్లోరామయ్య వీధిలో కృష్ణయ్య రూపొందించారు. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో ఆ తర్వాత ఆలయశిఖరం (అమితాబ్ నటించిన ఖుద్దార్ చిత్రం ఆధారంగా) తెరకెక్కించారు. అనంతరం చిరంజీవి, కోడి రామకృష్ణ కాంబినేషన్ దిగ్విజయంగా సాగింది. సింహపురి సింహం (చిరంజీవి ద్విపాత్రాభినయం), గూఢచారి నెం.1, రిక్షావోడు, అంజి చిత్రాలు మెగాస్టార్‌తో రూపొందించారు.

బాలకృష్ణకు తొలి సోలో విజయం
బాలకృష్ణకు సోలో విజయాన్ని అందించారు. హీరోగా మంగమ్మగారి మనవడు చిత్రంతో తొలి విజయాన్ని అందుకొన్నారు. తర్వాత బాలకృష్ణతో ముద్దుల కృష్ణయ్య, ముద్దులమావయ్య, మువ్వగోపాలుడు, ముద్దుల మేనల్లుడు, బాలగోపాలుడు లాంటి చిత్రాలు తీసారు. భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎస్ గోపాల్‌రెడ్డితో ఎక్కువ చిత్రాలకు కోడి దర్శకత్వం వహించారు.

రాజశేఖర్, అర్జున్ సర్జాకు భారీ హిట్లు
హీరో రాజశేఖర్‌కు భారీ విజయాలు అందించిన ఘనత కోడి రామకృష్ణకే దక్కింది. తలంబ్రాలు, అంకుశం, ఆహుతి చిత్రాలు భారీ విజయాలను అందుకొన్నాయి. ఇక సీనియర్ నటుడు అర్జున్‌కు తెలుగులో సుస్థిరమైన స్థానం కల్పించడంలో కోడి రామకృష్ణది పెద్ద పాత్రే. మా పల్లెలో గోపాలుడు, మన్నెంలో మొనగాడు చిత్రాలు సినిమా రికార్డులను తిరగరాశాయి.

మాస్ హీరోలతోనే కాకుండా క్లాస్ చిత్రాలు కూడా
ఇక మాస్ హీరోలతో సినిమాలు రూపొందించడమే కాకుండా కుటుంబ కథా చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించారు. మా ఇంటికి రండి, మనిషికో చరిత్ర, మూడిళ్ళ ముచ్చట, పెళ్ళాం చెబితే వినాలి, పంచదార చిలక, ఆస్తిమూరెడు ఆశబారెడు లాంటి మధ్య తరగతి జీవితాలను ప్రతిబింబించే చిత్రాలను తీసి ప్రేక్షకులను మెప్పించారు.


Click it and Unblock the Notifications











