వద్దురా విడిపోవద్దని అన్నాడు.. అలా విడిపోవాల్సి వచ్చింది.. రాజ్ మృతితో కోటి కన్నీటి పర్యంతం
ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ ఇక లేరు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివరం హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. ఆయన అసలు పేరు తోటకూర సోమరాజు. సంగీత ప్రపంచంలో అద్బుతమైన బాణిలతో ఆకట్టుకొన్న రాజ్ కోటిలతో ఒకరైన రాజ్ మరణ వార్తతో సినీ ప్రపంచం మూగబోయింది. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు. ఆయనతో సంగీత ప్రయాణాన్ని సాగించిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి.. రాజ్ లేరనే వార్తతో కన్నీటి పర్యంతం అయ్యారు.
సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నాను. కాసేపటి క్రితమే ఈ వార్త విన్నాను. నా రాజ్ చనిపోయారనే వార్తను జీర్ణించుకోలేకపోతోన్నాను. మొన్నీ మధ్యే ఓ సినిమా ఫంక్షన్‌లో కలుసుకున్నాం. ఆరోగ్య సమస్యలున్నట్టుగా నాకు అనిపించలేదు. రాజ్ కూడా చెప్పలేదు. ఈ రోజు ఉదయం హార్ట్ ఎటాక్‌తో ఆయన మరణించారని తెలిసి ఎంతో బాధగా ఉంది అని అన్నారు.

రాజ్ కోటిగా మేం ఇద్దరం ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాం. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. మేం ఇద్దరం విడిపోయిన తర్వాత కోటిగా నేను ఎన్ని సినిమాలు చేసినా.. వాటిని కూడా రాజ్ కోటి పాటలు అనేవారు. మేం ఇద్దరం ఇరవై నాలుగు గంటలూ పని చేసేవాళ్లం. చక్రవర్తి దగ్గర మేం ఇద్దరం అసిస్టెంట్లుగా పని చేశాం అని కోటి గుర్తు చేసుకొన్నారు.
తెలుగులో ముఠామేస్త్రి, హలోబ్రదర్స్ ఇలా ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. మేం ఇద్దరం తెలుగులో ఓ ట్రెండ్‌ను సృష్టించాం. ఈ రోజు నా రాజ్ లేడంటూ ఎంతో బాధగా ఉంది. మా పాటల రూపంలో నా రాజ్ కలకాలం ఉంటాడు. కాల ప్రభావం, పరిస్థితుల వల్ల మేం విడిపోయాం. నేను ఎన్ని సినిమాలు చేసినా కూడా రాజ్ నా పక్కన ఉన్నాడనే ధైర్యంతోనే చేయగలిగాను అని కోటి ఆవేదన వ్యక్తం చేశారు.

సంగీత దర్శకుడు రాజ్‌కి నేను ఒక తమ్ముడిలాంటి వాడిని. చిన్ననాటి స్నేహితులం. మేం ఇద్దరం విడిపోవడం నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది. వద్దురా విడిపోవద్దు అని అన్నాడు. కానీ అప్పటి పరిస్థితుల వల్ల విడిపోయాం. మా పాటల రూపంలో రాజ్ ఎప్పటికీ బతికే ఉంటాడు అని కోటి అన్నారు.


Click it and Unblock the Notifications











