కౌబాయ్ దర్శకుడు కేఎస్ఆర్ దాస్ మృతి
ప్రముఖ సినీ దర్శకుడు కేఎస్ఆర్ దాస్ (76) శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం అపోలో ఆస్పత్రికి వెళ్లిన దాస్ గుండెపోటుతో అక్కడే తుదిశ్వాసవిడిచారు. శనివారం చెన్నైలో అంత్యక్రియలు జరుగనున్నాయి.
నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన కేఎస్ఆర్ దాస్ అసలు పేరు కొండా సుబ్బరామదాసు. ఆయన తల్లిదండ్రులు శేషమ్మ, చెంచురామయ్య. తండ్రి వెంకటగిరి జమీందారీలో జమైదార్. దాస్ ఉద్యోగ జీవితం సినిమా హాల్లో బుకింగ్ క్లర్కుగా మొదలైంది. స్వాతంత్య్రానంతరం జమీందారీ వ్యవస్థ రద్దు కావడంతో దాస్ కుటుంబం కూడా రోడ్డున పడాల్సి వచ్చింది. అందుకే ఆయన ఎస్ఎస్ఎల్‌సీ వరకు మాత్రమే చదవగలిగారు.
సినిమాల మీద మోజుతో చెన్నైకి చేరుకున్న దాస్ ఆకలి మంటను చల్లార్చుకునేందుకు మంచినీటిని ఆశ్రయించిన రోజులెన్నో ఉన్నాయి. తర్వాత గౌరీ ప్రొడక్షన్స్ భావనారాయణ చలవతో.. ఆయన నిర్మించిన 'బండ రాముడు' సినిమాకు ఎడిటింగ్ అప్రెంటీస్‌గా పని చేశారు. ఆ శాఖలో శిక్షణ పొంది 'రమా సుందరి' సినిమాకు అసిస్టెంట్ ఎడిటర్‌గా పని చేశారు. అనంతరం 'నువ్వా-నేనా' సినిమాకు నెలకు రూ.250 జీతంతో ఎడిటర్‌గా పని చేశారు. 1966లో వచ్చిన 'లోగుట్టు పెరుమాళ్లకెరుక' దర్శకుడిగా ఆయన మొదటి సినిమా. సూపర్‌స్టార్ కృష్ణతో తెలుగులో తొలి కౌబాయ్ చిత్రం 'మోసగాళ్లకు మోసగాడు' రూపొందించింది ఆయనే.
దాస్ దర్శకత్వం వహించిన 102 సినిమాల్లో హీరో కృష్ణవే దాదాపు 40 చిత్రాలు ఉండటం విశేషం. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలిసినిమా.. 'టక్కరి దొంగ-చక్కని చుక్క'. ఆ తరువాత.. మోసగాళ్లకు మోసగాడు, ఏజెంట్ గోపీ వంటి సూపర్ హిట్ సినిమాలు రూపొందించారు. 'అల్లూరి సీతారామరాజు' దర్శకుడు మధ్యలో చనిపోతే, దాన్ని కేఎస్ఆర్ దాసే పూర్తి చేశారు. హీరోయిన్లలో జయప్రదతో ఎక్కువ సినిమాలు తీశారు. ఎన్టీఆర్‌తో దాస్ తీసిన 'యుగంధర్' సంచలన విజయం సాధించింది. అక్కినేని నాగేశ్వరరావుతో తప్ప మిగిలిన హీరోలందరితో దాస్ పని చేశారు.


Click it and Unblock the Notifications











