చదువు వల్ల నేను డైరెక్టర్ కాలేదు.. ఎవరో చేసిన తప్పుకు వీళ్ళు బలి.. డైరెక్టర్ మారుతి!
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు చేసిన తప్పిదాలకు విద్యార్థులు బలైపోతున్నారు. తెలంగాణ ఇంటర్మీడియర్ ఫలితాల తర్వాత విద్యార్థులు వరుసగా ఆత్మహత్యకు పాల్పడడంతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. సంచలనంగా మారిన ఈ ఘటనపై సెలెబ్రిటీలు వరుసగా స్పందిస్తున్నారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచిస్తున్నారు. తాజాగా సినీ దర్శకుడు మారుతి విద్యార్థుల ఆత్మహత్యలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

జీవితం కన్నా ముఖ్యమైనవి కావు
దర్శకుడు మారుతి ట్విట్టర్ ద్వారా తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్యపై స్పందించాడు. ప్రియమైన విధ్యార్ధులరా.. మన నైపుణ్యాన్ని, భవిష్యత్తుని ఈ పరీక్షలు నిర్ధారించలేవు. నేను చదువులో యావరేజ్ స్టూడెంట్ ని. ఆ తర్వాత యానిమేషన్ టెక్నాలజీలో టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్నా. కానీ నేను దర్శకుడు కావడానికి కారణం అది కాదు. సినిమాపై నాకున్న అంకితభావమే నన్ను దర్శకుడిని చేసింది అని మారుతి విద్యార్థులకు సూచించారు.
నేర్పాల్సింది అదే
విధ్యార్ధులరా మీ ధైర్యాన్ని కోల్పోవద్దు.. తల్లిదండ్రులారా మీ పిల్లలకు జీవితాన్ని ఎలా ఎదుర్కొనాలో నేర్పండి. ఒత్తిడికి గురిచేయొద్దు. పరీక్షల విషయంలో వారిని ఇబ్బందికి గురిచేయొద్దు అని మారుతి కోరారు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఆ ఫలితాల్లో చాలా అవకతవకలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్మీడియట్ బోర్డుకు వ్యతిరేకంగా విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా చేస్తున్నారు. ఈ అంశం మీడియాలో కూడా పెద్ద రచ్చగా మారుతోంది.

ఎవరో చేసిన తప్పుకు
మారుతి మాట్లాడుతూ మరణించిన విద్యార్థుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు పాల్పడి విద్యార్థులంతా బంగారు భవిష్యత్తుని కోల్పోయారని అన్నారు. ఎవరో చేసిన తప్పుకు వీళ్ళ జీవితాలు బలికావడం విచారకరం అంటూ మారుతి ట్వీట్ చేశారు.
ప్రపంచం అంతం అయిపోదు
మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా ట్విట్టర్ వేదికగా విద్యార్థులకు సలహా ఇచ్చాడు. పరీక్షా ఫలితాల వలన ప్రపంచం ఏమీ అంతం అయిపోదు. జీవితంలో ఇంతకంటే కఠినమైన పరీక్షలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. అందరూ ధైర్యంగా ఉండండి.. చివరి వరకు పోరాడండి అని సాయిధరమ్ తేజ్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











