‘వెయ్యి అబద్దాలు’తో డైరక్టర్ తేజ...
హైదరాబాద్ : సాయిరామ్ శంకర్ హీరోగా తేజ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే . దానికి 'వెయ్యి అబద్ధాలు' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. రమణ గోగుల స్వరాలిందిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 18 నుంచి షూటింగ్ మొదలు కానుంది. తేజ సినిమాకి ఆయన స్వరాలు సమకూర్చడం ఇదే తొలిసారి. ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. ''వినోదాత్మకంగా సాగే కథ ఇది. హీరో పాత్రలో వైవిధ్యం కనిపిస్తుంది'' అని చిత్రవర్గాలు చెబుతున్నాయి.
రాజేంద్రప్రసాద్‌తో 'సినిమాకెళ్దాం రండి' చిత్రాన్ని నిర్మించిన శ్రీ ప్రొడక్షన్స్ సంస్థ ఈ 'వెయ్యి అబద్ధాలు'సినిమాను నిర్మించబోతోంది. నిర్మాతలు సునీత ప్రభాకర్, సీత నెక్కంటి ఆ వివరాలను తెలియజేస్తూ - తేజ-సాయిరామ్‌శంకర్ కాంబినేషన్‌లో ఓ వైవిధ్యమైన కథాంశంతో సినిమా చేయబోతున్నాం. త్వరలో చిత్రీకరణ మొదలుపెడతాం. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు.
ఇక నీకు నాకు డాష్ డాష్ సినిమా తర్వాత తేజ చేస్తున్న చిత్రం ఇది. ఆ మధ్యన దగ్గుపాటి రానా తో తేజా చిత్రం చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే అది మెటీరియలైజ్ కాలేదు. రీలాంచ్ సినిమాగా వచ్చిన నీకు నీకు డాష్ డాష్ డిజాస్టర్ అయ్యింది. దాంతో తేజతో చేయటానికి పెద్ద హీరోలెవరూ ఆసక్తి చూపటం లేదు. అయితే సాయిరామ్ శంకర్ కూడా అదే సిట్యువేషన్ లో ఉన్నాడు. అతనితో చేయటానికి కూడా పెద్ద నిర్మాతలు సాహసం చేయటం లేదు.
ప్రస్తుతం సాయిరామ్ శంకర్ 'యమహో యమః' అనే చిత్రం చేస్తున్నారు. ఒక యమభక్తుడు సృష్టించే సందడితో ఆద్యంతం సరదాగా సాగే చిత్రమిది. యమధర్మరాజు అమెరికా వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చిందనే విషయాన్ని తెరపైనే చూడాలి. వినోదం, భావోద్వేగాల మేళవింపుతో కథ సాగుతుంది. యమధర్మరాజుగా శ్రీహరి నటన ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అన్నారు. ఈ చిత్రంలో సాయిరామ్‌శంకర్, పార్వతి మెల్టన్ జంటగా నటిస్తున్నారు. శ్రీహరి యమధర్మరాజు పాత్రని పోషిస్తున్నారు. జి.విజయ్‌కుమార్‌గౌడ్ నిర్మాత. రచన: వెలిగొండ శ్రీనివాస్, సంగీతం: మహతి, కళ: వి.ఎస్.మణి, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్.


Click it and Unblock the Notifications











