పవన్ పాట పెట్టడానికి రీజన్ ఏమిటంటే.....?
హైదరాబాద్ : తాజాగా వచ్చి విజయవంతమైన 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాలో... 'తొలిప్రేమ' పాట రీమిక్స్ చేయడం, 'ఖుషి' సినిమాలో సన్నివేశం వాడుకోవడం చేసారు. అయితే ఇవన్నీ పవన్ కల్యాణ్ అభిమానుల్ని ఆకర్షించడానికేనా? అనే ప్రశ్నను దర్శకుడు విజయ్‌కుమార్ ముందు మీడియావారు ఉంచారు. దానికి ఆయన సమాధానమిచ్చారు.
ఆయన మాట్లాడుతూ... ఆ మాట కొస్తే మా టీమ్ అంతా పవన్ అభిమానులే. నితిన్ అందరికంటే పెద్ద అభిమాని. మా అభిమాన కథానాయకుడి పాటను మరోసారి గ్రాండ్‌గా చూసుకోవాలనుకొన్నాం. 'తొలిప్రేమ' పాట ఈ సినిమాలో రీమిక్స్ చేయాలనేది సుధాకర్‌రెడ్డి ఆలోచన. అనూప్ మాత్రం 'రీమిక్స్ ఎందుకు? కొత్త పాట చేద్దాం' అన్నాడు.
కానీ మేం మాత్రం బలవంతం చేశాం. ఆ పాటకు నితిన్ ప్రాణం పోశాడు. ఇక 'ఖుషి' ఆలోచన మాత్రం... మాటల రచయిత హర్షవర్థన్‌దే. ఆ రెండింటికీ థియేటర్‌లో వస్తున్న స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది. ఈ సినిమాని పవన్ కల్యాణ్‌కి ప్రత్యేకంగా చూపించాలనుకొంటున్నాం అన్నారు.
అలాగే చూసుకోకుండా ప్రేమించుకోవడం... 'ప్రేమలేఖ' నాటి రోజులు. మరి ఫేస్‌బుక్‌ల కాలంలో ఇలాంటి కథ ఎలా నిలబడుతుందని భావించారు అని ప్రశ్నించగా... ఇలాంటి సందేహాలు స్క్రిప్టు దశలో మాక్కూడా వచ్చాయి. వాటికి సమాధానాలు సంభాషణల రూపంలో ఇచ్చేశాం. ప్రేక్షకులకు ఎలాంటి అనుమానాలు వస్తాయో ముందే అంచనా వేసి... ఆ ప్రశ్నలే పాత్రధారుల చేత పలికించాం. 'ప్రేమలేఖ' సినిమా ప్రభావం నాపై చాలా ఉంది. నాకిష్టమైన చిత్రాల్లో అదొకటి అని వివరించారు.


Click it and Unblock the Notifications











