ఇంట్లో నగలన్నీ అమ్మేసి ఆ సినిమా తీశా.. హరికృష్ణ హీరో.. రామోజీరావు లేకుంటే ..!
యలమంచిలి వెంకట సత్యనారాయణ చౌదరి అంటే టక్కున గుర్తురాకపోవచ్చు. కానీ వైవీఎస్ చౌదరి అంటే ఇంటే చెప్పేస్తారు. అన్న నందమూరి తారక రామారావుకి వీరాభిమాని అయిన చౌదరి.. ఆయన స్పూర్తితోనే చిత్రసీమలో అడుగుపెట్టారు. ఎడిటర్ నరసింహారావు, కే రాఘవేంద్రరావుల వద్ద అసిస్టెంట్‌గా ఎన్నో హిట్ సినిమాలకు పనిచేశారు. అనంతరం '' శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి ''తో దర్శకుడిగా మారారు . తొలి చిత్రంలోనే దిగ్గజ నటుడు, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావును డైరెక్ట్ చేసే అరుదైన అవకాశాన్ని అందుకున్నారు చౌదరి. తర్వాత సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, దేవదాసు, ఒక్క మగాడు, సలీం, నిప్పు, రేయ్ సినిమాలు తీశారు. దర్శకత్వం వహిస్తూనే నిర్మాతగానూ మారారు. ఆయన తీసిన కొన్ని చిత్రాలు ఫ్లాప్ కాగా.. ఒక్క మగాడు, నిప్పు, రేయ్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి రూ.కోట్లలో నష్టాల్లో కూరుకుపోయి వెండితెరకు దూరమయ్యారు వైవీఎస్.
సినిమాలు తీయకున్నా ఇండస్ట్రీకి మాత్రం దూరం కాలేదు చౌదరి. దాదాపు పదేళ్ల తర్వాత ఆయన మరోసారి సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. నందమూరి కుటుంబం నుంచి మరో హీరోను పరిచయం చేయనున్నట్లు వైవీఎస్ చౌదరి ప్రకటించారు. ఎన్టీఆర్ మునిమనవడు, హరికృష్ణ మనవడు, దివంగత జానకీరామ్ పెద్దకుమారుడు నందమూరి తారక రామారావును ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లు చౌదరి తెలిపారు. హరికృష్ణతో సినిమాలు తీశానని.. ఇప్పుడు ఆయన మనవడిని కూడా ప్రేక్షకులకు పరిచయం చేసే అదృష్టం దక్కిందన్నారు. ఈ చిత్రంలో తెలుగు అమ్మాయినే హీరోయిన్‌గా తీసుకుంటానని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తానని వైవీఎస్ చౌదరి స్పష్టం చేశారు. తన భార్య గీత నిర్మాతగా న్యూ టాలెంట్ రోర్స్ అనే కొత్త బ్యానర్‌ను ఆయన స్థాపించారు. దీనిపైనే హరికృష్ణ మనవడితో సినిమా చేయనున్నారు చౌదరి.

అయితే ఈ ప్రెస్‌మీట్‌లో వైవీఎస్ చౌదరి పరిశ్రమలో తాను ఎదుర్కొన్న కష్టాలను పంచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా లాహిరి లాహిరి లాహిరిలో సినిమా తీసేటప్పుడు పడ్డ ఇబ్బందులను తెలిపారు. ఆదిత్య ఓం తెలుగువారికి కొత్త అని, సినిమాలోని నాలుగు జంటలకు సేలాబులిటి లేదని.. వాళ్ల మీద కోటి నుంచి కోటి యాభై లక్షల సినిమా తీస్తే .. దానిని రిలీజ్ చేయడానికి ప్రోత్సాహం రావొచ్చునన్నారు. కానీ రూ.3 కోట్ల 90 లక్షల ఖర్చుతో లాహిరి లాహిరి లాహిరిలో తీశానని .. అప్పటికి తన ఫ్లాట్ తాకట్టు పెట్టేశానని , భార్య నగలు, అమ్మగారు, అత్తగారి నగలను అమ్మేశానని వైవీఎస్ చౌదరి వెల్లడించారు.
రామోజీరావు గారు లేకుంటే లాహిరి లాహిరి లాహిరిలో సినిమా రిలీజ్ అయ్యేది కాదన్నారు. తాను జీవితంలో యేటికి ఏదురిదీ చేసిన యుద్ధాలేనని.. చావుకు మనం భయపడకూడదని, చావే మనల్ని చూసి భయపడాలని , మందని వేసుకుని దున్నపోతులా తిరగడం కాదు.. ఒక్కడే తిరగాలని నమ్ముతానని.. వీటినే డైలాగ్స్‌గా పెట్టానని వైవీఎస్ చౌదరి గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2002లో మేడే కానుకగా విడుదలైన ''లాహిరి లాహిరి లాహిరిలో '' సినిమా ఘన విజయం సాధించింది. నందమూరి హరికృష్ణ, భానుప్రియ, సుమన్, రచనా బెనర్జీ, ఆదిత్య ఓం, అంకిత, వినీత్, సంఘవి, లక్ష్మీ, కే విశ్వనాథ్, చక్రవర్తి, కాంతారావులు నటించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు. అటు యువతరాన్ని, ఇటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చింతపల్లి రమణ సంభాషణలు, సిరివెన్నెల సాహిత్యం, కీరవాణి మ్యూజిక్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.


Click it and Unblock the Notifications











