ఇది పిరికిపందల చర్యే: శ్రీలంక పేలుళ్లపై మహేష్ బాబు
ఈస్టర్ ఆదివారం శ్రీలంకలో మృత్యువు కరాల నృత్యం చేసింది. చర్చిలు, ఫైవ్ స్టార్ హోటల్స్ లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన వరుస బాంబు పేలుళ్లలో 290 మంది మృతి చెందారు. ఈ దారుణ ఘటన ప్రపంచం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది.
మృతుల్లో ఐగుగురు భారతీయులతో పాటు డజన్ల సంఖ్యలో ఇతర దేశాల వారు ఉన్నారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదుల చర్యను ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించారు. తాజాగా ఈ ఘటనపై సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్ చేశారు.
ఇది పిరికిపందల చర్యే
‘‘శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటన గురించి తెలిసి షాకయ్యాను. పిరికిపందల చర్యే. ఇది చాలా కష్టసమయం. బాధితులు, వారి కుటుంబాల కోసం ప్రార్థనలు జరుపుదాం.'' అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.
మంచు మనోజ్
మంచు మనోజ్ రియాక్ట్ అవుతూ...‘అమాయకుల ప్రాణాలు పోవడం ఎప్పుడు ఆగుతుంది? శ్రీలంకలో జరిగిన దారుణం గురించి తెలిసి షాకయ్యాను. ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. బాధితులు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అంటూ ట్వీట్ చేశాడు.

24 మంది అదుపులోకి
బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి 24 మందిని లంక అధికారులు అరెస్ట్ చేశారు. ఈ చర్యకు పాల్పడింది ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈస్టర్ పండగ సందర్భంగా క్రైస్తవ ప్రార్థనా మందిరాలను, విదేశీ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది.

తృటిలో తప్పించుకున్న రాధిక శరత్ కుమార్
ప్రముఖ సౌత్ నటి రాధిక శరత్ కుమార్ శ్రీలంక బాంబు పేలుళ్ల నుంచి తృటిలో తప్పించుకున్నారు. కొలంబొలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేసిన ఆమె... ఆ హోటల్ నుంచి బయటకు వచ్చిన కొద్ది సేపటికే అక్కడ పేలుళ్లు సంభవించాయి.


Click it and Unblock the Notifications











