ఆ హీరోయిన్లతో నన్ను పోల్చవద్దు: తాప్సీ
దక్షిణాది సినిమాల ద్వారా పాపులర్ అయిన హీరోయిన్లు....తర్వాత బాలీవుడ్ బాట పట్టి తమకు బ్రేక్ ఇచ్చిన సౌత్ సినిమాలను చిన్న చూపు చూస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వారిలో అసిన్, కాజల్ పేర్లు ముఖ్యంగా చెప్పకొచ్చు. అయితే ఇలాంటి వారితో తనను పోల్చవద్దంటూ తెగేసి చెబుతోంది తాప్సీ. హిందీ నా మాతృభాష..బాలీవుడ్‌లో నటించడం చాలా సౌకర్యంగా వుంటుంది కానీ ప్రస్తుతం దక్షిణాది చిత్రాల్లో నాకు వైవిధ్యమైన పాత్రలు లభిస్తున్నాయి. తక్కువ కాలంలోనే ఇక్కడ నేను స్టార్‌డమ్ పొందగలిగాను. అందుకే బాలీవుడ్‌లో చాలా అవకాశాలు వస్తున్నా దక్షిణాదికే ప్రాధాన్యతనిస్తున్నా... అని చెప్పింది. అంతేకాదు ఝుమ్మందినాదం చిత్రంలో లాగా గ్లామర్ రోల్స్‌తో పాటు మిస్టర్‌పర్‌ఫెక్ట్ సినిమాలోని అభినయ ప్రధాన పాత్రలు కూడా తనకిష్టమంటోంది ఈ సొట్టబుగ్గల సోయగం.
ప్రస్తుతం తాప్సీ సౌత్ సినిమా పరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. తెరంగేట్రం చేసిన అనతికాలంలోనే భారీ చిత్రాలు ఈ సుందరిని వెతుక్కుంటూ వస్తున్నాయి. ఝుమ్మందినాదం చిత్రంలో నునులేత అందాలతో కనువిందు చేసిన ఈ వయ్యారికి మిస్టర్ పర్‌ఫెక్టులో మ్యాగీ పాత్ర యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ని తెచ్చిపెట్టింది. తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో గోపీచంద్ సరసన మొగుడు చిత్రంలో నటిస్తోంది. తమిళంలో విశాల్‌తో నటిస్తున్న 'వాన్‌తాన్ వెండ్రాన్ (తెలుగులో 'వచ్చాడు గెలిచాడు), మలయాళంలో మమ్ముట్టితో నటిస్తున్న 'డబుల్స్" చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అంతే కాకుండా హిందీలో 'ఛష్మే బద్దూరు" చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











