HBD Uday Kiran: అర్ధాంతరంగా తిరిగి రాని లోకాలకు.. ఇంకా రిలీజ్ కానీ ఉదయ్ కిరణ్ మూవీ గురించి తెలుసా?
బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది నటీనటులు అడుగుపెట్టి తమ నటనతో ప్రేక్షకులను అలరించారు. వీరిలో కొందరు సూపర్‌స్టార్లుగా ఎదిగితే .. మరికొందరు మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్లిపోయారు. కానీ కొందరు మాత్రం చేసింది ఒకటి రెండు సినిమాలే అయినా ఇప్పటికీ వారిని తలచుకోకుండా ఉండలేం. ఈ కోవకే చెందుతారు ఉదయ్ కిరణ్. టాలీవుడ్‌లో మెరుపులా వచ్చి మాయమైన ఆయన ఎందరినో విషాదంలోకి నెట్టారు. ఇవాళ ఉదయ్ కిరణ్ జయంతి కావడంతో అభిమానులు ఆయనను తలచుకుంటున్నారు.
ఉదయ్ కిరణ్ .. ముఖంపై చెరగని చిరునవ్వుతో చూడటానికి మన ఫ్యామిలీ మెంబర్‌లా, పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. ఉదయ్ కిరణ్ మనల్ని విడిచి పదేళ్లు దాటింది. అయినప్పటికీ ఆయన సినిమాలు, ప్రస్తావనలు తరచూ వింటూనే ఉంటాం. 2000వ సంవత్సరంలో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సినిమాతో ఉదయ్ కిరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీలో ఉదయ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. చిత్రం మూవీ ఆ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. తొలి సినిమాతోనే ఉదయ్ కిరణ్‌కు తిరుగులేని క్రేజ్ వచ్చింది.

తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి బ్లాక్‌బస్టర్స్‌తో ఉదయ్ కిరణ్‌కు స్టార్ డమ్ వచ్చింది. అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు సినిమాలను మించి ఉదయ్ మూవీస్ ఓపెనింగ్స్, వసూళ్లను రాబట్టేవి. ఆ సమయంలో బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్ కొట్టిన హీరో ఒక్క ఉదయ్ కిరణ్ మాత్రమే. చాక్లెట్ బాయ్, లవర్ బాయ్ ఇమేజ్‌తో ఆయనకు యువతో ముఖ్యంగా అమ్మాయిల్లో ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉండేది.
అనంతరం కలుసుకోవాలని, శ్రీరామ్, నీ స్నేహం, నీకు నేను నాకు నువ్వు వంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నారు. కానీ తర్వాత ఈ సక్సెస్ ట్రాక్‌ను ఉదయ్ కిరణ్ కొనసాగించలేకపోయారు. వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు, అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఈ దశలో పెళ్లి చేసుకున్న ఆయన వైవాహిక జీవితంలోనూ ఒడిదొడుకులు ఎదుర్కొన్నారని సన్నిహితులు చెబుతారు.
కెరీర్‌లో సక్సెస్ లేక, వ్యక్తిగత జీవితంలోనూ సమస్యలతో ఉదయ్ కిరణ్ మానసికంగా బలహీనుడై అర్ధాంతరంగా జీవితాన్ని చాలించారు. 2014 జనవరి 5న హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన ఫ్లాట్‌లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయేనాటికి ఉదయ్ వయసు 33 ఏళ్లే. అతని మరణవార్తతో చిత్ర పరిశ్రమ , అభిమానులు షాక్‌కు గురయ్యారు.

ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన చివరి సినిమా జైశ్రీరామ్ అని అంతా అనుకుంటారు. కానీ అది నిజం కాదు.. ఆయన చివరి సినిమా 'చిత్రం చెప్పిన కథ'. మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మదాలస శర్మ , గరిమా జైన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఉదయ్ కిరణ్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన మున్నా అనే వ్యక్తి ఈ సినిమాకు నిర్మాత. ఉదయ్ బతికున్నప్పుడే సినిమా షూటింగ్ పూర్తి చేయగా.. ఆయన మరణించిన 2 నెలలకు ట్రైలర్ విడుదలైంది.
అయితే పలు కారణాలతో దాదాపు 10 ఏళ్లుగా చిత్రం చెప్పిన కథ విడుదల కాలేకపోతుంది. అయితే మూడేళ్లుగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మున్నా కొద్దికాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి కార్యరూపం దాల్చి చిత్రం చెప్పిన కథ త్వరగా విడుదల కావాలని ఉదయ్ కిరణ్ అభిమానులు, సన్నిహితులు కోరుతున్నారు.


Click it and Unblock the Notifications











