ధర్మవరపును వరించిన డాక్టరేట్
నటునిగా, దర్శకునిగా, సంగీత దర్శకునిగా బహుముఖ ప్రజ్ఞావంతునిగా తెలుగువారిని అలరిస్తున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి నాగార్జున యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక సభ్యునిగా ఉన్న ధర్మవరపు ప్రస్తుతం రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. గత ఇరవై ఏళ్లుగా తెలుగు చలనచిత్ర రంగానికి విశిష్ట సేవలు అందిస్తున్నందుకు గాను గౌరవ డాక్టరేట్ అందిస్తున్నట్టు నాగార్జున యూనివర్సిటీ అధికారిక ప్రకటన పేర్కొంది.
దూరదర్శన్‌లో ఆనందో బ్రహ్మ సూపర్‌హిట్ కామెడీ సీరియల్‌తో దర్శకునిగా, నటునిగా రంగప్రవేశం చేసిన ధర్మవరపు తరువాత అనేక చిత్రాలలో విలక్షణమైన పాత్రలను పోషించారు. నరేశ్ హీరోగా తోకలేని పిట్ట చిత్రానికి దర్శకత్వంతో పాటు సంగీత దర్శకత్వం కూడా నిర్వహించారు. ప్రస్తుతం కమేడియన్‌గా ఆయన చాలా బిజీగా ఉన్నారు.
యూరోపియన్ తెలుగు సంఘం (ఈటా) వారి 11వ ద్వైవార్షిక కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి ఆహ్వానం అందింది. సెప్టెంబర్ 9, 10 తేదీలలో యుకెలోని వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌లో ఘనంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమాలలో ధర్మవరపుతో పాటు జూనియర్ ఎన్టీఆర్, కమేడియన్ సునీల్ కూడా పాల్గొనడం విశేషం.


Click it and Unblock the Notifications