మహేష్ దూకుడుతో దిక్కుతోచనన్ని ఆఫర్లు...!?
ఏ మాయ చేసావె, బృందావనం, దూకుడు.. ఇలా తను నాయికగా నటించిన మూడు చిత్రాలు విజయాలు సాధించడంతో 'దూకుడు" మీద వున్న సమంతకు ఇప్పుడు టాలీవుడ్‌లో డిమాండ్ పెరిగింది. గ్లామర్ తో పాటు నటనకు స్కోప్ వున్న పాత్రలను చేసే అరుదైన నాయికల జాబితాలో స్థానం సంపాందించుకున్న సమంత వైపు దర్శక, నిర్మాతలు ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో మహేష్ సరసన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె" చెట్టు చిత్రంలో జతకడుతున్న ఈ భామ రాజమౌళి 'ఈగ"తో పాటు నాగచైతన్య సరసన 'ఆటోనగర్ సూర్య"లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మూడు భాషల్లో రూపొందనున్న చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించనుంది. కాగా ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు మరో అరుదైన అవకాశం లభించింది. యువ కథానాయకుడు అల్లు అర్జున్, 'బొమ్మరిల్లు" భాస్కర్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రంలో సమంత నాయికగా ఎంపికైనట్లు తెలిసింది. శ్రీ వెంక సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌మీదకు వెళ్ళనుంది.


Click it and Unblock the Notifications











