సమీరరెడ్డి.. ఇకఇంతే సంగతులు?
మంచి సినిమా కథ ముఖ్యమా, హిట్టయ్యే సెంటిమెంట్లు ముఖ్యమా అని తెలుగులో ఏ నిర్మాతనయినా అడగండి.. సెంటిమెంటే అంటారు. అన్నా, అనకపోయినా అనే నిజం కూడా. అంటే మదర్ సెంటిమెంటో, ఫాదర్ సెంటిమెంటో, సిస్టర్ సెంటిమెంటో అని కాదు.. టైటిల్ సెంటిమెంట్లు, హీరోయిన్ లెగ్ మహిమ.. లొకేషన్ సెంటిమెంట్లు.. ఇలా సవాలక్ష అంశాలపై కూడా సినిమాలు రూపొందిస్తుంటారు తెలుగులో. అలాంటి ఓ సెంటిమెంటుకు బాధితురాలు.. సమీరారెడ్డి.
కథ బాగాలేకపోతే ఆమె మాత్రం ఏం చేస్తుంది? కానీ నిర్మాతలూ, దర్శకులు అలా ఆలోచించరే! నరసింహుడు చిత్రంలో ఆమె సెకండ్ హీరోయిన్. ఆ చిత్రం విడుదలయ్యాక నిర్మాత ఆత్మహత్యకు ప్రయత్నించి హుస్సేన్ సాగర్‌లో దూకాల్సి వచ్చింది. ఇక రెండో సినిమా జై చిరంజీవ! మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే పెద్ద ఢమాల్ సినిమాల్లో అదీ ఒకటిగా రికార్డుకెక్కింది. ఇక ముచ్చటగా మూడో చిత్రం - అశోక్. మొదట్లో ఫర్వాలేదనిపించినా తర్వాత జనం ఆ సినిమా విషయంలో చప్పరించేశారు.
ఈ మూడు చిత్రాలలో కామన్ ఎలిమెంట్ సమీరారెడ్డి కాబట్టి ఇంక చాలు మొర్రో అంటూ నిర్మాతలూ, దర్శకులూ సమీరను హీరోయిన్‌గా ఎంపిక చేయడానికి వణికిపోతున్నారు. మరి వీళ్ల భయమే నిజం అనుకుంటే.. హిందీలో టాక్సీ నెంబర్ 9211లో కూడా సమీరారెడ్డి ప్రధాన పాత్ర పోషించింది. మరి అది హిట్టే కదా!
అయినా, ఇంత మాత్రాన సమీరారెడ్డి నిరాశచెందడం లేదు. హిందీలో ఇప్పటికే ఆమె సన్నీ డియోల్, వివేక్ ఒబెరాయ్‌ల సరసన ఒక చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, ఐటెమ్ సాంగ్స్‌కి స్వస్తి చెప్పి, నటిగా గుర్తింపు పొందడం కోసం .. గత ఏడాది బెస్ట్ డైరెక్టర్‌గా నేషనల్ అవార్డు గెలుచుకున్న బెంగాలీ దర్శకుడు బుద్ధదేవ్ దాస్‌గుప్తా చిత్రంలో ఒక ఆఫ్‌బీట్ పాత్ర పోషించడానికి సమీరారెడ్డి సై అంది. మళ్లీ ఆమెని తెలుగులో ప్రమోట్ చేయడానికి ఎన్టీఆర్ ఎంతవరకూ ఉత్సాహం చూపిస్తారో చూడాలి!


Click it and Unblock the Notifications