విష్ణు ‘దూసుకెళ్తా’ ఫస్ట్ లుక్
హైదరాబాద్ : మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న 'దూసుకెళ్తా' ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ చిత్రానికి వీరూ పోట్ల దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు నిర్మాత...అందాల రాక్షసి ఫేమ్ లావణ్య హీరోయిన్. 24 ఫ్రేమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ చిత్రం టైటిల్ కి తగినట్లే విజయం వైపు దూసుకు వెళ్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు దర్శక, నిర్మాతలు.
ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ ''కథకు అతికినట్లు సరిపోయే పేరు అదే. వినోదం, యాక్షన్ అంశాలు సమపాళ్లలో మేళవించి ఉంటాయి. నిదానమే ప్రధానం.. అనే మాట అస్సలు పట్టించుకోడు. వేగం కూడా విస్తుపోయేలా దూసుకెళ్తేనే విజయం.. అనేది అతను నమ్మే సిద్ధాంతం. ఆ ప్రయాణంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే ''అన్నారు.
ఇక ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ సాగుతోంది. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, ఆహుతి ప్రసాద్, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి, కళ: రఘు కులకర్ణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్, సమర్పణ: అరియానా, వివియానా.
కెరీర్ ఇక అయిపోయినట్లే అని అనుకుంటున్న తరుణంలో 'దేనికైనా రెడీ' చిత్రంతో హిట్ కొట్టిన విష్ణు తన రాబోయే సినిమాలపై చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాడు. 'దూసుకెళ్తా' చిత్రంతో పాటు విష్ణు...తన తండ్రి మోహన్ బాబు, తమ్ముడు మనోజ్‌లతో కలిసి మల్టీ స్టారర్ చిత్రంలో కూడా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications












