జపనీస్, స్వాహిలి భాషల్లో ‘ఈగ’
హైదరాబాద్: రాజమౌళి గ్రాఫికల్ వండర్ 'ఈగ' చిత్రం జపనీస్, స్వాహిలి(కెన్యా) బాషల్లో అనువదించి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయమై రాజమౌళి స్పందిస్తూ....'ఈగ చిత్రాన్ని తెలుగు, తమిళంలో విడుదల చేస్తే మంచి స్పందన వచ్చింది. అనంతరం మలయాళం, హిందీలో కూడా అనువదించి మంచి ఫలితాలను సాధించాం. జపనీస్, స్వాహిలి భాషల్లోకి కూడా ఈచిత్రాన్ని అనువదించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం, ప్రాసెస్ నడుస్తోందని' అన్నారు.
ఈగ చిత్రాన్ని హిందీలో 'మక్కి' పేరుతో రిలయన్స్ ఎంటర్ టైనర్ వారు భారీ ఎత్తున రిలీజ్ చేసారు. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈచిత్రంలో రాజమౌళి దర్శకత్వానికి, సుదీప్ నటనకు, కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌కు ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేసేశారు.
భారతీయ సినీ చరిత్రలోనే 'ఈగ' గొప్ప గ్రాఫికల్ చిత్రంగా పేరు తెచ్చుకుంది. వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించగా సురేష్ బాబు సమర్పణలో విడుదలైంది. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: సెంథిల్ కుమార్. ఈగ చిత్రం భారత్ తరుపున ఆస్కార్ బరిలో నిలుస్తుందని అనుకున్నప్పటికీ.... ఎంపిక కాలేక పోయింది.
రాజమౌళి ప్రస్తుతం ప్రభాస్‌తో సినిమాకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఛత్రపతి చిత్రంతో ప్రభాస్‌కు భారీ విజయాన్ని అందించిన రాజమౌళి ఈ సారి సరికొత్త కోణంలో యంగ్ రెబల్ స్టార్‌ను చూపెట్టబోతున్నారు.


Click it and Unblock the Notifications











