పాటలో ముస్లింల మనోభావాలు దెబ్బ తీసారని కోర్టుకి
హైదరాబాద్: 'ఏక్‌విలన్' హిందీ సినిమాలోని ఓ పాటలో ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా పదాలను ఉపయోగించారంటూ వచ్చిన వినతిని పరిగణనలోకి తీసుకొని.. ఆ నిర్ణయాన్ని సాధ్యమైనంత త్వరగా పిటిషనర్‌కు తెలియజేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ)కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.

ఏక్‌విలన్ హిందీ సినిమాలోని 'యహీడూబే.. దిన్‌మేరా..' గీతంలో ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా పదాలను ఉపయోగించారని అభ్యంతర వ్యక్తం చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సమీఉల్లాఖాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈనెల 27వ తేదీన సినిమా విడుదల కానుందని, ఈ లోపే పాటలోని అభ్యంతరకరమైన పదాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోర్టును అభ్యర్థించారు.
అప్పటివరకు ఆ సినిమా విడుదల కాకుండా ఆదేశాలు జారీచేయాలన్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించినా వాటిపై ఎలాంటి పురోగతి లేదన్నారు. దీంతో ఈనెల 18వ తేదీన పిటిషనర్ సమర్పించిన వినతిపై సీబీఎఫ్‌సీ నిర్ణయం వెలువరించాలని న్యాయమూర్తి ఆదేశాల్లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











