సాహో నటిని బెంబేలెత్తించిన అజ్ఞాత వ్యక్తి.. హోటల్ రూమ్ వద్ద ఏం చేశాడంటే!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం సాహో. యువ దర్శకుడు సుజిత్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 200 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సాహో చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో సాహో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే ఆగష్టు 15న విడుదల అని ప్రకటించారు. దీనితో అనుకున్న సమయానికి చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు దర్శకుడు సుజిత్ వేగంగా చిత్రీకరణ జరుపుతున్నాడు. సాహో షూటింగ్ సందర్భంగా హాట్ బ్యూటీ ఎవిలిన్ శర్మకు చేదు అనుభవం ఎదురైంది.

బాలీవుడ్ నటులు
సాహో చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. బాహుబలితో ప్రభాస్ కు జాతీయ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. సాహో చిత్రానికి నార్త్ లో మరింతగా క్రేజ్ పెంచేలా దర్శకుడు సుజిత్ ఈ చిత్రానికి ఎక్కువగా బాలీవుడ్ నటుల్ని తీసుకున్నాడు. అందాల భామ శ్రద్దా కపూర్ ప్రభాస్ కు హీరోయిన్ గా నటిస్తోంది. మందిర బేడీ, ఎవిలిన్ శర్మ, నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

చేదు అనుభవం
రామోజీ ఫిలిం సిటీలో సాహో షూటింగ్ సందర్భంగా ఇటీవల ఎవిలిన్ శర్మకు చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. షూటింగ్ ముగించుకుని ఎవిలిన్ శర్మ తాను బస చేసే హోటల్ రూమ్ కు బయలుదేరింది. రామోజీ ఫిలిం సిటీ నుంచి ఓ హోటల్ వరకు ఓ అజ్ఞాత వ్యక్తి ఎవిలిన్ శర్మ కారుని వెంబడించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో ఎవిలిన్ శర్మ చాలా భయానికి గురైనట్లు తెలుస్తోంది. చాలా సేపు ఆ వ్యక్తి హోటల్ బయటే ఉన్నాడట. అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో ఎవిలిన్ శర్మ ఆందోళనకు గురైందట.

అభిమానులంటే ఇష్టమే
అక్కడున్న సెక్యూరిటీ అతడి గురించి ఆరా తీయగా ఎవిలిన్ శర్మ అభిమాని అని చెప్పాడట. అతడికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపేశారు. ఈ ఘటనపై ఎవిలిన్ శర్మ స్పందించినట్లు తెలుస్తోంది. తనకు అభిమానులంటే ఇష్టమే అని, వారిని కలుసుకోవాలని, ముచ్చటించాలని నాకు కూడా ఉంటుందని తెలిపింది. కానీ దానికి ఓ సమయం, సందర్భం అంటూ ఉండాలి. ఇలాంటి సమయాల్లో కొంతమంది అభిమానుల ప్రవర్తన భయాందోళనకు గురిచేసేలా ఉంటుందని ఎవిలిన్ తెలిపింది.

కళ్ళు చెదిరే యాక్షన్
దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న సాహో చిత్రంలో ఎవిలిన్ శర్మ పాత్ర చాలా కీలకం అని అంటున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఎవిలిన్ శర్మ నటిస్తోందట. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని ఆగష్టు 15న విడుదల చేయనున్నారు. ప్రభాస్ ఈ చిత్రంలో అంతర్జాతీయ దొంగగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











