ఆ పదవికి ఒక్క అడుగు దూరంలో.. నెక్ట్ నువ్వే అన్నా.. పవన్ కల్యాణ్ పై స్టార్ క్రికెటర్ సెన్సేషనల్బ్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గన్నవరం ఐటీ పార్క్ సమీపంలోని కేసరపల్లిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. వీరితో పాటు 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు , పవన్ కళ్యాణ్‌లకు సినీ, రాజకీయ తదితర రంగాల ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, సినీనటులు రజనీకాంత్, చిరంజీవి తదితరులు హాజరై ఏపీ కొత్త సీఎం, డిప్యూటీ సీఎంలకు శుభాకాంక్షలు తెలిపారు.
తాజాగా ఈ లిస్ట్‌లో చేరారు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. '' ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా చూడాలనే మా కలికి పవన్ ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. జనసేనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఇది గొప్ప రోజు '' అని అంబటి రాయుడు ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత రాజకీయాల వైపు వెళ్లాలని అంబటి రాయుడు భావించారు. అయితే వెంటనే తన నిర్ణయం ప్రకటించకుండా తన స్వగ్రామమైన పొన్నూరు పరిసర ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. రాజకీయాల్లోకి రావడమైతే గ్యారెంటీ కానీ ఎందులో చేరేది మాత్రం చెప్పలేదు. కానీ మధ్యలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పలుమార్లు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కలిశారు. దీంతో రాయుడు .. వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది.
అయితే ఒకరోజు జగన్‌ని కలిసి వైసీపీ కండువా కప్పుకుని షాకిచ్చారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. పట్టుమని వారం రోజులు కూడా గడవకముందే వైసీపీకి రాజీనామా చేసిన అంబటి రాయుడు.. ఆ వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆ పార్టీ చేరారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధుల విజయానికి తన వంతు పాత్ర పోషించారు. మరి రాయుడు సేవలను పవన్ కళ్యాణ్ ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి.
అయితే పవన్ కళ్యాణ్‌ని సీఎంగా చూడాలన్నది ఒక్క అంబటి రాయుడు కల మాత్రమే కాదు. కోట్లాది మంది అభిమానులు, ప్రత్యేకించి కాపు సామాజికవర్గం దశాబ్ధాల కోరిక. ఉమ్మడి ఏపీకి కానీ, నవ్యాంధ్రకి కానీ తమ వర్గం నుంచి ఎవరూ ముఖ్యమంత్రి కాలేకపోయారని వారి ఆవేదన . రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న తమను ఓట్ల సమయంలో వాడుకుని వదిలేయడమే తప్పించి సీఎం పదవి వరకు రానివ్వడం లేదని కాపులు ఎన్నోసార్లు వాపోయారు.
వంగవీటి మోహన రంగా, చిరంజీవి వంటి వాళ్లు సీఎం రేసులో నిలిచినప్పటికీ లక్ష్యం చేరుకోలేకపోయారు. రంగా హత్యకు గురికాగా.. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ విఫలమైంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం సరికొత్త వ్యూహాలతో రాజకీయంగా దూసుకొస్తున్నారు. పదేళ్లు ఎన్నో కష్ట నష్టాలకు ఒర్చుకుని , సొంత డబ్బు ఖర్చు చేసి, ఎన్నో త్యాగాలు చేసి నేడు కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్‌లోని విపక్షనేతను చూసిన జనం.. ఇకపై ఆయనలోని పాలకుడిని కూడా చూడనున్నారు. జనసేనాని ఇదే పోరాటం, స్పూర్తిని కొనసాగిస్తే భవిష్యత్తులో సీఎం పదవిని దక్కించుకోవడం పెద్ద కష్టం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











