నైజాంలో మరింత ‘దమ్ము’
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన 'దమ్ము' చిత్రం సూపర్ కలెక్షన్లతో దూసుకెలుతోంది. ఏ థియేటర్ చూసినా హౌస్ ఫుల్ కలెక్షన్లే. ఈ నేపథ్యంలో నైజాం ఏరియాలో మరిన్ని స్ర్కీన్లు పెంచాలని నిర్ణయించారు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు. దీని వల్ల టిక్కెట్లు దొరక అసంతృప్తికి గురవుతున్న ప్రేక్షకుల ఇబ్బందులు తప్పనున్నాయి.
జూ ఎన్టీఆర్, త్రిష, కార్తీక జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో దుమ్ము రేపుతోంది. తొలి రోజు 1400 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం దాదాపు 13 కోట్ల షేర్ వసూలు చేసింది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 9 కోట్లు షేర్ రాబట్టింది.
దమ్ము చిత్రం పైరసీకి గురి కాకుండా నిర్మాతలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పైరసీని అరికట్టడానికి ఆ చిత్ర నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్ మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్స్.... మద్రాసు హైకోర్టు నుంచి ముదస్తు లీగల్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీస్ ప్రకారం దమ్ము చిత్రాన్ని ఎవరు పైరసీ చేసినా వారిపై చర్యలుంటాయి. అంతేకాదండోయ్ ఇంటర్నెట్ ఉంది కదా అని...నెట్ నుంచి పైరసీ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నా....పైరసీ సీడీలు కొన్నా కష్టాల్లో పడతారు.
వేణు, కోట శ్రీనివాసరావు, సుమన్, నాజర్, కిశోర్, సంపత్, శ్రీధర్‌రెడ్డి, చలపతిరావు, భానుప్రియ, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, అలీ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్‌పై కె.ఎస్. రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి రచన: ఎమ్.రత్నం, పాటలు: చంద్రబోస్, కెమెరా: ఆర్థర్ విల్సన్, సంగీతం: కీరవాణి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను.


Click it and Unblock the Notifications











