పవన్ కళ్యాణ్ పేరుతో మోసపూరిత లేఖ... సినిమాలు పచ్చి అబద్దం!
పవన్ కళ్యాణ్ పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న లెటర్ ఫేక్ లెటర్ అని తేలిపోయింది. తన పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి రాసినట్లుగా ఉన్న ఈ లేఖలో తాను మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు, త్వరలోనే సినిమాలకు సైన్ చేయబోతున్నట్లు పేర్కొనబడి ఉంది.
పవన్ కళ్యాణ్ మళ్లీ నటన వైపు వస్తున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఈ లేఖ దర్శనమివ్వడం, పవన్ కళ్యాణ్ స్వయంగా అభిమానులను ఉద్దేశించి ఈ లేఖ రాసినట్లు ఉండటంతో ఇది హాట్ టాపిక్ అయింది.

అది మోసపూరితమైన లేఖ
‘పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన శ్రేణులు ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం, సేవా కార్యక్రమాలు చేయడం చూసి ఓర్వలేని కొందరు పవన్ కళ్యాణ్ పేరిట ఒక తప్పుడు లేఖ సృష్టించినట్లు పార్టీ దృష్టికి వచ్చింది. ఆ లేఖ పచ్చి మోసపూరితమైనది, పవన్ క ళ్యాణ్ తన పదవిని వదులుకుని సినిమాల్లోకి నటిస్తున్నారనే కట్టకథలతో కూడిన లేఖ అది. ఇలాంటి అసత్య అంశాలను ఎవరూ విశ్వసించవద్దు.'' అని వన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ తెలిపారు.

ఆ లేఖ సృష్టించిన వారిపై లీగల్ యాక్షన్
తప్పుడు లేఖను సృష్టించి సర్క్యులేట్ చేస్తున్న వారిపై కేసు దాఖలు చేసి, లీగల్ గా ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. పార్టీ లీగల్ విభాగం ఇందుకు అవసరమైన చర్యలు ప్రారంభిస్తుంది.... అని తెలుపుతూ జనసేన పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా పేజీ ద్వారా బహిరంగ లేఖ విడుదల చేసింది.

ప్రజా క్షేత్రంలోనే పవన్ కళ్యాణ్
‘‘ఎన్నికలు అనేవి రాజకీయ, ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక భాగం మాత్రమే, నిరంతరం ప్రజలకు చేరువగా ఉండి, ప్రజల పక్షాన నిలవడమే తన బాధ్యత అని పవన్ కళ్యాణ్ నమ్ముతారు. అందుకు అనుగుణంగా ప్రజా క్షేత్రంలోనే ఉంటున్నారు'' అని హరిప్రసాద్ తెలిపారు.

సినిమాలకు పూర్తిగా దూరం
తనకు సినిమాల్లో నటించే ఆసక్తి లేదని, తన జీవితం ప్రజా సేవకే అంకితం అని గతంలోనే పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన మళ్లీ సినిమాల్లోకి వస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయిదే ఇదంతా తప్పుడు ప్రచారమే అని తాజాగా జనసేన పార్టీ విడుదల చేసిన లేఖతో స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











