అంచనాలు పెంచిన ‘ఫలక్‌నుమా దాస్’ ట్రైలర్
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' మూవీలో సైకో వివేక్ పాత్రలో నటించిన విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఫలక్‌నుమా దాస్'. ఈ చిత్రానికి దర్శకత్వం కూడా విశ్వక్ సేన్ కావడం విశేషం. హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్‌నుమా ఏరియాలో జరిగే కథతో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ సోమవారం విడుదల చేశారు.
'ఫలక్‌నుమా దాస్' ట్రైలర్ చూస్తుంటే ఈ జనరేషన్ యూత్ ఇష్టపడే అంశాలతో చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పాతబస్తీ కుర్రాళ్ల గ్యాంగ్ వార్స్, ప్రేమకథలు, పోలీస్ స్టేషన్ పంచాయితీలు లాంటి జనరల్ టాపిక్స్ ఎంచుకుని వినోదాత్మకంగా కథను నడిపించినట్లు తెలుస్తోంది.
'శంకరన్న సూపర్ కదరా... ఫలక్‌నుమాలో ఆయన ఏదనుకుంటే అది జరుగుతుంది. మనం కూడా అన్నలెక్క గ్యాంగ్ పెడదామా?' అంటూ స్కూల్ పిల్లలు గ్యాంగ్ ఏర్పరుచుకునే సీన్లతో ట్రైలర్ ప్రారంభమైంది. రోటీన్ ప్రేమకథలకు భిన్నంగా రియాల్టీకి దగ్గరగా ఉండే సన్నివేశాలతో విశ్వక్ సేన్ ఈ చిత్రాన్ని రూపొందించినట్లు స్పష్టమవుతోంది.
పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ మూవీలో ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ ఎస్సై పాత్రలో నటించాడు. రియాల్టీ కోసమో? సీన్లలో డెప్త్ ఉండాలనే ఆలోచనో? ఏమో తెలియదు కానీ... బూతులతో కూడిన తిట్లు కూడా పచ్చిగా అలాగే వాడటేయటం గమనార్మం.

ఈ మూవీలో విశ్వక్ సేన్, సలోని మిశ్రా హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా హర్షితా గౌర్, ప్రశాంతి, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. విశ్వక్ సేన్ దర్శకత్వం వహిస్తుండగా కరాటే రాజు నిర్మాత. వివేక్ సాగర్ సంగీతం అందించారు. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











