Singer KK No More: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో సింగర్ కేకే కన్నుమూత
కొంత కాలంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సినీ పరిశ్రమల్లోనూ వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతోన్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఇలాంటి సంఘటనలు మరింతగా ఎక్కువయ్యాయి. పలు కారణాలతో ఇప్పటికే చాలా మంది గొప్ప గొప్ప ప్రముఖులు ప్రాణాలను కోల్పోయారు. ఇలా కొద్ది రోజుల వ్యవధిలోనే ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్లు, ఆర్టిస్టులు ఇలా సినీ రంగంతో సంబంధం ఉన్న పలువురు ప్రముఖులు కన్నుమూశారు.
ఈ క్రమంలోనే తాజాగా భారతీయ చలన చిత్ర రంగంలో మరో పెను విషాదం చోటు చేసుకుంది. దాదాపు అన్ని భాషల్లోనూ తన గాత్రంతో అలరించిన ప్రముఖ సింగర్ కేకే (కృష్ణకుమార్ కున్నత్) మరణించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

ఆ షో తర్వాత కేకేకు గుండెపోటు
సుదీర్ఘ కాలంగా తన పాటలతో యావత్ భారతావనిని అలరిస్తోన్న ప్రముఖ గాయకుడు కేకే (కృష్ణకుమార్ కున్నత్) గత రాత్రి కలకత్తాలోని ఓ కళాశాల ప్రాంగణంలో లైవ్ షో నిర్వహించారు. ఇది విజయవంతంగా ముగించుకుని తాను బస చేస్తోన్న హోటల్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆ హోటల్‌లోనే కుప్పకూలిపోయారు.

గుండెపోటుతో మరణించిన కేకే
లైవ్ షో తర్వాత హోటల్‌కు చేరుకున్న సింగర్ కేకే (కృష్ణకుమార్ కున్నత్) గుండెపోటుకు గురైనట్లు అక్కడి సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే ఆయనను స్థానికంగా ఉన్న సీఎంఆర్‌ఐ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కేకేను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మరణించినట్లు గుర్తించారు. ఆ తర్వాత ఈ విషాదకరమైన విషయాన్ని డాక్టర్లు అధికారికంగా ప్రకటించారు.

కేకేకు సెలెబ్రిటీలు నివాళులు
దిగ్గజ గాయకుడు కేకే (కృష్ణకుమార్ కున్నత్) మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. దీంతో ఆయన మరణంపై అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలుపుతున్నారు. దీంతో కేకే (కృష్ణకుమార్ కున్నత్) పేరు ట్విట్టర్‌లో దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.

మోడీ అలా... ఆర్పీ ఇలా పోస్ట్
కేకే మరణంపై దేశ ప్రధాని మోడీ 'కేకే పాటలు అన్నిరకాల భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయి. అన్ని వయసుల వారిని అలరిస్తాయి. ఆయన పాడిన పాటలతో కేకే ఎప్పటికీ గుర్తించుకుంటాం. కేకే కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి' అని పోస్ట్ చేశారు. అలాగే, టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ కూడా కేకేతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

అలా పరిచయం... అన్నింట్లో
ఢిల్లీలో జన్మించిన కేకే 1999లో బాలీవుడ్ చిత్రం పాల్ సినిమాతో పరిచయమయ్యారు. అనంతరం పలు హిట్ సాంగ్స్ పాడి భారతీయ చలన చిత్ర పరిశ్రమలో నేపథ్య గాయకుడిగా తనదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే హిందీ, తెలుగు, తమిళ, మళయాలం, కన్నడ, బెంగాలీ తదితర భాషల్లో పాటలు పాడారు. దీంతో ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు.

తెలుగులో స్టార్ హీరోలందరికీ
సింగర్ కేకే 'ప్రేమదేశం' సినిమాలో 'కాలేజ్ స్టైల్', 'హలో డాక్టర్' వంటి పాటలతో తెలుగు వాళ్లకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోల సినిమాలు అన్నింట్లోనూ పాటలు పాడారు. మరీ ముఖ్యంగా 'ఖుషి', 'ఘర్షణ', 'ఆర్య', 'రామయ్య వస్తావయ్యా', 'ఎవడు', 'శంకర్‌దాదా' వంటి చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు.


Click it and Unblock the Notifications











