రామ్ పై ఒత్తిడి : కొత్త సినిమా కోసం అభిమాని ఉపవాస దీక్ష
రామ్ తదుపరి చిత్రం ప్రకటించే వరకూ ఉపవాసం చేస్తానని ప్రకటించాడు ఓ అభిమాని.
హైదరాబాద్: హీరో రామ్‌ని ఫ్యాన్స్ టెన్షన్ పెడుతున్నారా అంటే అవుననే చెప్పాలి. హైపర్ చిత్రం అనంతరం ఇప్పటివరకూ రామ్ కొత్త చిత్రం ప్రకటించలేదు. దాంతో తన తర్వాతి చిత్రం గురించి ప్రకటించాలని ట్విటర్ వేదికగా అభిమానులు తొందర పెడుతున్నారు. గతంలో ఈ విషయంపై రామ్ స్పందిస్తూ.. మీ తొందర అర్థం అయ్యింది, ఇంకొన్నాళ్లు ఎదురుచూడాలని కోరారు. ప్రస్తుతం తన తర్వాతి ప్రాజెక్టు పనిమీదే ఉన్నట్లు ట్వీట్ చేశారు. అయితే తాజాగా మరో అభిమాని ఇంకో అడుగు ముందుకు వేశాడు.
'రామ్ అన్నయ్య.. నేటి నుంచి నీ తర్వాతి ప్రాజెక్టు గురించి ప్రకటించే వరకు ఉపవాసం ఉంటా' అని ట్వీట్ చేశాడు. అది చూసిన రామ్ హడలిపోయారు. 'ఇలాంటి కొత్త టెన్షన్స్ పెట్టకు తమ్ముడు.. నేను ఆ పనిమీదే ఉన్నా' అంటూ లవ్ హ్యాష్‌ట్యాగ్ జత చేశారు.
రామ్ 'హైపర్' చిత్రం తర్వాత ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రస్తుతం ఆయన తర్వాతి చిత్రం కోసం కొత్త లుక్‌లో సిద్ధం అవుతున్నారు. నేను శైలజతో మంచి హిట్ కొట్టిన రామ్ తర్వాత వెంటనే సినిమా చేయలేదు. మంచి కథను ఎంపిక చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటునట్లు చెప్తున్నారు. కరుణాకరణ్ దర్శకత్వంలో రామ్ సినిమా చేస్తాడని వార్తలు వినపడుతున్నాయి.
ఆ మధ్యన అనిల్‌రావిపూడి దర్శకత్వంలో రామ్ సినిమా చేద్దామని అనుకున్నాడు. కానీ చివరకు అది మెటీరియలైజ్ కాకపోవడం, ఆ దర్శకుడు రవితేజతో ముందుకు వెళ్లటంతో రామ్ మరే సినిమాను సెట్స్‌లోకి తీసుకెళ్లలేదు. ఫైనల్ గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ సినిమా చేయాలని ఫిక్స్ అయినట్లు చెప్తున్నారు. ఈ మేరకు కథా చర్చలు జరుగుతున్నాయని, ఈ లుక్ కూడా ఆ ప్రాజెక్టు కోసమే అంటున్నారు.
ఈ చిత్రాన్ని మల్టీ డైమన్షన్ రామ్మోహనరావు, స్రవంతి రవి కిషోర్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ కరుణాకరన్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.


Click it and Unblock the Notifications











