ఏది నిజం: బాహుబలి కథపై రాజమౌళి క్లారిటీ ఇవ్వాల్సిందే
హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి తన ప్రతి సినిమా విడుదల ముందే కథ బయటకు చెప్పేస్తాడు. అయితే ‘బాహుబలి' సినిమా విషయంలో మాత్రం అలా చేయలేదు. కానీ సోషల్ మీడియాలో ఇదే బాహుబలి కథ అంటూ ఓ స్టోరీ చక్కర్లు కొడుతోంది. అయితే ఇది నిజమైన కథేనా? లేక ఫేకా? అనే క్లారిటీ లేక అభిమానులు అయోమయంలో ఉన్నారు.
అది నిజమైన కథా? లేక ఫేకా? అనే దానిపై రాజమౌళి సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇవ్వాలని పలువురు అభిమానులు కోరుకుంటున్నారు. కాగా బాహుబలి చిత్రం జులై 10 విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇటు ఇటు రాజమౌళి...అటు ప్రభాస్, రానా, తమన్నా తదితరులు తమ సినిమా ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు.

ప్రచారంలో ఉన్న కథ ఇదే...
క్రీ.పూ. 540వ సంవత్సరంలో మహిష్మతి రాజ్యాన్ని ఓ రాజు పాలిస్తుండేవాడు. ఆయనకు ఇద్దరు కుమారులు అమరేంద్ర బాహుబలి (ప్రభాస్), భల్లలదేవ (రానా), ఓ కుమార్తె శివంగి (రమ్యకృష్ణ). అనంతరం ఆ రాజు మహిష్మతి రాజ్యనికి అమరేంద్ర బాహుబలిని అధిపతి చేస్తాడు. ఆయన భార్య దేవసేన (అనుష్క). వారి పాలనలో ప్రజలు సుఖశాంతులతో కాలం గడుపుతూ ఉంటారు. స్వార్థ పరుడైన మంత్రి బిజ్జలదేవ (నాజర్), బాహుబలి సోదరుడు భల్లలదేవ కలిసి అమరేంద్ర బాహుబలిని చంపి రాజ్యాన్ని తమ ఆధీననంలోకి తెచ్చుకుంటారు. రాజ్యం తమ అధీనంలోకి వచ్చాక తన విగ్రహాన్ని ప్రతిష్టించుకుంటాడు భల్లలదేవ. అంతే కాదు ప్రజలను తమ బానిసలుగా చూస్తాడు. పసివాడైన బాహుబలి కుమారుడుని కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు భల్లలదేవ. అయితే దేవసేన తన కుమారుడిని కాపాడి రాజ్యం దాటిస్తుంది. అనంతరం భల్లలదేవ సైన్యం దేవసేనను బంధిస్తారు. మరోవైపు బాహుబలి కుమారుడిని కొందరు గ్రామస్తులు కాపాడి.. పెంచి పెద్దచేసి అతనికి శివుడు (ప్రభాస్) అని పేరు పెడతారు. తన తండ్రి పోలికలతోనే ఉండే శివుడు అందర్నీ తన ధైర్య సాహసాలతో ఆకర్షిస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితులలో తన ప్రాంతానికి రాజకుమారి అవంతిక (తమన్నా) వస్తుంది. ఆమె అందం చూసి శివుడు తనని ప్రేమిస్తాడు. ఆ తర్వాత శివుడు అవంతికని వెతుక్కుంటూ మహిష్మతి రాజ్యానికి వెళ్తాడు. అక్కడ శివుడు తన గతం గురించి తెలుసుకొని క్రూరుడైన భల్లలదేవపై ప్రతీకారం తీర్చుకొని రాజ్యాన్ని, ప్రజలను, తన తల్లిని ఎలా సొంతం చేసుకొన్నాడు అనేదే "బాహుబలి" చిత్ర కధ.


Click it and Unblock the Notifications











