ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య.. టాప్ హీరోయిన్లందరికీ డిజైనర్ గా !
సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాదులో ఉన్న ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, పలు హీరోయిన్లకు సెలబ్రిటీస్ స్టైలిస్ట్ గా పనిచేసిన ప్రత్యూష గరిమెళ్ళ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆమె మరణానికి సంబంధించి పలు కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలేం జరిగింది? ఆమె ఆత్మహత్యకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే

అనేక మంది హీరోయిన్లకు
దేశంలో ఉన్న టాప్ 30 ఫ్యాషన్ డిజైనర్స్ లో ఒకరైన ప్రత్యూష గరిమెళ్ళ హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నారు. ఆమె తెలుగు హిందీ సహా పలువురు దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన హీరోయిన్స్ కోసం దుస్తులు డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.. బాలీవుడ్ భామ దీపికా పదుకొనే, కీర్తి సురేష్, శృతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రేయ, నిక్కీ గల్రాని, కృతికర్బంధ, ప్రణీత సహా అనేక మంది హీరోయిన్లకు డ్రెస్సులు డిజైన్ చేశారని తెలుస్తోంది.

అనుమానాస్పద స్థితిలో
కేవలం సినీ పరిశ్రమకు చెందిన వారికే కాదు ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలకు సైతం ప్రత్యూష డ్రెస్సులు డిజైన్ చేశారని తెలుస్తోంది. దాదాపు దక్షిణాది హీరోయిన్లు అందరికీ ఆమె కనీసం ఒక్క డ్రెస్ అయినా డిజైన్ చేసి ఉంటారని ఈ రంగంలో ఆమె మంచి నిష్ణాతురాలు అని తెలుస్తోంది. అయితే హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఆమె ఇంటిలోని బాత్రూంలో ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు.

కేసు నమోదు చేసి
ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె మృతదేహాన్ని ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె బాత్రూంలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ దొరికిందని తెలుస్తోంది. దీంతో ఆ బాటిల్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని క్లూస్ టీం కి అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ వ్యవహారం మీద అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు.

డిప్రెషన్ లో ఉందని
ఆమె ఎలక్ట్రికల్ గ్రిల్ లో కార్బన్ మోనాక్సైడ్ కెమికల్ వేసి ఆ తర్వాత ఆ పొగ పీల్చే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఆమెకు అత్యంత సన్నిహితులైన స్నేహితులను కదిలిస్తే మాత్రం ఆమె గత కొంత కాలంగా డిప్రెషన్ లో ఉందని అంటున్నారు. డిప్రెషన్ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు.

దేశంలోనే టాప్ 30
సౌత్ ఇండియాకి ఏ బాలీవుడ్ హీరోయిన్ వచ్చినా ముందుగా ప్రత్యూషనే ప్రిఫర్ చేసేవారని కొంతమంది హీరోలకు సైతం ఆమె డ్రెస్సులు డిజైన్ చేశారని తెలుస్తోంది. బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ నుంచి మాస్టర్స్ డిగ్రీ అందుకున్న ప్రత్యూష తొలుత తన తండ్రికి చెందిన ఎల్ఈడీ తయారీ వ్యాపారంలో అడుగుపెట్టి తర్వాత అది తనకు కలిసిరాదని భావించి తనకు బాగా ఇష్టమైన ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ప్రత్యూష గరిమెళ్ళ అనే తన పేరుతో ఒక ఫ్యాషన్ లేబుల్ క్రియేట్ చేసి దేశంలోనే టాప్ 30 ఫ్యాషన్ డిజైనర్స్ లో ఒకరిగా పేరు సంపాదించారు. 2013వ సంవత్సరంలో ఈ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె అతి కొద్దికాలంలోనే నిష్ణాతులు అయ్యారు.


Click it and Unblock the Notifications











