ఉదయ్ కిరణ్ ఆత్మహత్య: తండ్రి అనుమానం
హైదరాబాద్ : తన కుమారుడు సూసైడ్ చేసుకునేటంత పిరికివాడు కాదని ఉదయ్ కిరణ్ తండ్రి వివికె మూర్తి మీడియాకు తెలియచేసారు. అలాగే ఆర్దిక ఇబ్బందలు అనే మాటను ఆయన కొట్టిపారేసారు. హైదరాబాద్‌లో అతనికి కోట్ల రూపాయలు ఆస్దులున్నాయని తెలిపారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వెనక ఏదో బలమైన కారణం ఉందని అన్నారు.
అలాగే తనకు ఆరేళ్ల నుంచి ఉదయ్ కిరణ్‌తో మాటలు లేవని ఆయన వెల్లడించారు. ఆస్దిని దుర్వినియోగం చేస్తున్నాననే అనుమానంతో తనను దూరం పెట్టాడని తెలిపారు. అప్పటినుంచీ తనకు దూరంగా ఉంటున్నాడని తెలిపారు. చచ్చిపోయి చేసేది ఏమీ ఉండదని, బ్రతికిఉంటే జీవితంలో ఎప్పటికైనా పైకి రావచ్చని ఆవేదనతో అన్నారు.

ఇక తను పెళ్లి చేసుకున్న విషయమే తనకు చెప్పలేదన్నారు. తనకు తెలిసి ఉన్నంతవరకూ ఆర్ధిక ఇబ్బందులు లేవని చెప్పుకొచ్చారు. విదేశాల నుంచి తన కూతురు వచ్చాక మృత దేహాన్ని చూడటానికి వెళతానని అన్నారు.
ఉదయ్‌కిరణ్ ఆత్మహత్యను అనుమానాస్పద కేసుగా నమోదు చేసినట్లు డీసీపీ సత్యనారాయణ తెలిపారు.భార్య విషిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. కుటుంబ వివాదాలు, సినీరంగంలో ఒత్తిళ్ల వల్లే ఉదయ్‌కిరణ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందని చెప్పారు.
ఉదయ్‌కిరణ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని బంజారాహిల్స్ ఏసీపీ అశోక్‌కుమార్ తెలిపారు. ఆయన భార్య ఇంటికి వచ్చి చూసేసరికి ఉరివేసుకుని ఉన్నారని చెప్పినట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో ఎవరూ లేరని వెల్లడించారు. ఉదయ్‌కిరణ్ దంపతులు మాత్రమే ఇంట్లో నివసిస్తున్నారని చెప్పారు. ఉదయ్‌కిరణ్ ఆత్మహత్యపై కుటుంబసభ్యులు, స్నేహితులు, అపార్ట్‌మెంట్ వాసుల నుంచి ఏసీపీ వివరాలు సేకరించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











