చీలిన బ్రాహ్మణులు, మోహన్ బాబుకు అండగా...
హైదరాబాద్: 'దేనికైనా రెడీ' సినిమాపై కొన్ని రోజులుగా బ్రాహ్మణులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమను కించ పరిచే విధంగా సన్నివేశాలు చిత్రీకరించారంటూ బ్రాహ్మణ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
తాజాగా కొందరు బ్రాహ్మణ పెద్దలు, పండితులు మోహన్ బాబుకు అండగా నిలుస్తూ మీడియా ముందుకు వచ్చారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మోహన్ బాబు లాంటి మంచి వ్యక్తులకు పిండం పెట్టడం సరికాదని ఆయనకు అండగా నిలిచారు. మోహన్ బాబు కుటుంబం అన్ని విధాలుగా బాగుండాలని ఆశీర్వదించారు. అయితే వీరు చెన్నయ్ కి చెందిన బ్రాహ్మణులు కావడం గమనార్హం.
ఈ సందర్భంగా మీడియా వారు ఆందోళన చేస్తున్న బ్రాహ్మణుల గురించి మోహన్ బాబును ప్రశ్నించగా.... తాను ఏమీ మాట్లాడ దలుచుకోలేదని, న్యాయస్థానంలో కేసు నడుస్తున్నందున అక్కడే అన్నీ విషయాలు తేలుతాయని సమాధానం ఇచ్చారు. ఓ వైపు కొందరు బ్రాహ్మణులు మోహన్ బాబుకు ఆశీర్వచనాలు ఇస్తుండగా.... అదే సమయంలో మరో వైపు కొందరు బ్రాహ్మణులు హైదరాబాద్ లోని ఖైరతాబాద్ చౌరస్తాలో మోహన్ బాబుకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం గమనార్హం.
మరో వైపు తెలుగు సినీ పరిశ్రమలోని పెద్దలు ఈ విషయమై మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఏవీఎస్ మాట్లాడుతూ...... ఎవరినీ కించపరచాలనే ఉద్దేశ్యం సినిమా వాళ్లకి ఉందని, కాకతాళీయంగా అలాంటివేమైనా జరిగితే సెన్సార్ బోర్డుకు వెళ్లాలని, ఇంటిపై, థియేటర్లపై దాడులు చేయడం తగదని వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications












