మొత్తానికి ఫైటర్స్ ఆందోళన విరమించారు. తమ హక్కుల సాధన కోసం గత మూడు రోజులు గా నిరాహార దీక్ష చేస్తున్న ఎ.పి.సినీ ఫైటర్స్ అసోసియేషన్ బుధవారం మద్యాహ్నం నుండీ తమ ఆందోళన విరమించుకొంది. తెలుగు సినిమా ఇండియాలో తీస్తే 60 : 40, మన రాష్ట్రం లోనే నిర్మిస్తే 50 : 50 నిష్పత్తిలో తెలుగు ఫైటర్స్ కి అవకాశాలు కల్పించాలన్నది వారి ప్రధాన కోరిక. ఇందుకోసం వీరు చేస్తున్న నిరాహార దీక్షకు స్పందించిన దర్శకనిర్మాత దాసరి నారాయణరావు, ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు కె.ఎస్.రామారావు లు వారి తో సమావేశమై వారి కోరికలు సమంజసమైనవేననీ అవి నెరవేరేలా తాము చూస్తామని హామీ ఇచ్చి వారి చేత దీక్షను విరమింప జేసారు. మీకు ఏ కష్టం వచ్చినా నన్ను అడగండి అని దాసరి వారికి హామీని ఇచ్చారు. ఈ రోజు మద్యాహ్నం నుండే వారు విధులకు హాజరు కావచ్చని కె.యస్.రామారావు సూచించారు.