ఎన్టీఆర్‌లో ఆ ప్రత్యేకత ఉంది.. అందుకే నాకిష్టం.. బన్నీ చాలా మారిపోయాడు: ఉత్తేజ్
అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ రంగ ప్రవేశం చేసి తర్వాత ఎన్నో చిత్రాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించిన నటుడు ఉత్తేజ్. డిగ్రీ చదువుతున్న సమయంలోనే సినిమాలపై ఆసక్తితో రాంగోపాల్ వర్మ వద్ద శివ (1989) సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అదే సినిమాలో క్యాంటీన్ బాయ్ గా నటించాడు. ఉత్తేజ్ మేనమామ సుద్దాల అశోక్ తేజ తెలుగు సినీ రంగంలో ప్రసిద్ధ గీత రచయిత. కేవలం నటుడిగానే కాకుండా మాటల రచయితగా కూడా పని చేశాడు. ఈ క్రమంలోనే ఎన్నో అవార్డులు అందుకున్నాడు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నాడు. అదే సమయంలో ప్రస్తుత తరం హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

హీరోలు డబ్బులు తీసుకోవాలి
ఈ ఇంటర్వ్యూలో హీరోల రెమ్యూనరేషన్ గురించి ఆయన మాట్లాడుతూ.. ‘నేను నటుడిని కాబట్టి చెప్పడం కాదు.. హీరోలందరూ డబ్బులు తీసుకోవాలి. చిరంజీవిగారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్, ఎన్టీఆర్, పవన్ ఇలా అందరూ కోట్లు తీసుకోవచ్చు. ఎందుకంటే సినిమా కోసం వీళ్లంతా అంత కష్టపడతారు. సిక్స్ ప్యాక్‌లు మెయింటేన్ చేసి, ఎక్కడ పడితే అక్కడ తాళ్లు కట్టుకుని, ఫైట్లు చేసి ఎండను చూడకుండా కష్ట పడుతుంటారు' అని చెప్పుకొచ్చాడు.

మూమెంట్ చేస్తే లిప్ ఇవ్వరు
అలాగే, హీరోలు పడుతున్న కష్టాలపై స్పందిస్తూ.. ‘చాలా సమయాల్లో డ్యాన్స్ చేసేటప్పుడు మూమెంట్ చేస్తే లిప్ రాదు.. లిప్ వస్తే మూమెంట్ రాదు. అయినా.. అది కరెక్టుగా వచ్చే వరకు చేస్తూనే ఉంటారు. కొన్ని సార్లు ఎండలో షర్ట్ ఏమీ లేకుండా డ్యాన్స్ చేస్తారు. దీంతో వాళ్లు ఇబ్బంది పడతారు. అప్పుడు షూటింగ్‌కు గ్యాప్ వస్తుంది' అని ఆయన వివరించారు.

బన్నీ చాలా మారిపోయాడు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి వివరిస్తూ.. ‘నిజంగా చెప్పాలంటే హీరోలందరూ కష్టపడతారు. తమను తాము చెక్కుకోకపోతే.. గంగోత్రి నుంచి మొన్న వచ్చిన సినిమా వరకు బన్నీ ఎంత మారాడు. ఇప్పుడు అతడిని చూస్తే గంగోత్రి హీరోనేనా అనే సందేహం వస్తుంది. అంతలా తనను తాను చెక్కుకున్నాడు' అని పేర్కొన్నాడు.

మిగతా హీరోల గురించి
ప్రస్తుత తరం హీరోల గురించి ప్రస్తావిస్తూ.. ‘చాలా మంది హీరోలు కష్ట పడుతున్నారు. మహేశ్ కూడా చాలా కష్టపడతాడు. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నాడు. అలాగే, నాని.. ఆయన నటన ఎంతో రియలిస్టిక్‌గా ఉంటుంది. ఇక, రవితేజ అయితే మన పక్కింటి అబ్బాయిలాగే కనిపిస్తాడు. చరణ్‌కు తండ్రి నుంచి వచ్చిన ప్రోఫెషనలిజమ్ వచ్చింది. రంగస్థలంలో అతడిలోని నటుడు బయటకు వచ్చాడు' అని అన్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ గురించి
ఈ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ‘ఎన్టీఆర్‌లో నాకు ఆర్టిస్టు కనిపిస్తాడు. యాక్టర్ వేరు.. ఆర్టిస్టు వేరు. ఒక స్టార్‌డమ్‌తో పాటు ఒక ప్రొఫెషనల్ యాక్టర్ ఉంటాడు. సోల్ ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్ గారి ఆత్మ వచ్చి ఈయనలో ఉండిపోయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక డ్యాన్సర్, ఫైటర్, సీన్లలో ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది. పైగా, యాక్టింగ్ చేసేటప్పుడు డైరెక్టర్ ఏమైనా చెబితే అది ఏమాత్రం తేడా రాకుండా దాన్ని చేసి చూపిస్తాడు. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే విపరీతమైన మెమరీ అందుకే ఎన్టీఆర్ అంటే ఇష్టం' అని వెల్లడించాడు.


Click it and Unblock the Notifications











