మార్చి 1 నుండి పరిశ్రమ షట్‌డౌన్, ఇండస్ట్రీలోనే దొంగలు, నైజాంలో ఆ ముగ్గురు...
బాలయ్యతో 'జై సింహ' సినిమా చేసి సంక్రాంతికి విడుదల చేస్తున్న ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్..... తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. మార్చి 1 నుండి దక్షిణాది సినీ పరిశ్రమను షట్ డౌన్ చేయబోతున్నామని, ఈ మేరకు తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని తెలిపారు.

వారికి వ్యతిరేకంగానే....
డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్... క్యూబ్, యూఎఫ్ఓ మూలంగా నిర్మాతలు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని, క్యూబ్, యూఎఫ్ఓల వల్ల ముఖ్యంగా చిన్న సినిమాలు చితికిపోతున్నాయని సి.కళ్యాణ్ తెలిపారు.

జీఎస్టీ వల్ల చాలా నష్టం
జీఎస్టీ కూడా చిన్న సినిమాలకు అతిపెద్ద సమస్యగా మారిందని, ఇది కార్పొరేట్ కంపెనీలు నిర్మించే సినిమాలకు సరిపోతుందేమో కాని, తమలాంటి ఇండివిడ్యువల్ నిర్మాతలకు చాలా నష్టమే అని, ఈ విషయంలో ప్రభుత్వం తమకు పరిష్కారం చూపాలని, అందుకే ఈ పోరాటం చేస్తున్నామని తెలిపారు.

ఇన్నాళ్లు ఓపిక పట్టాం, ఇక మా వల్ల కాదు
ఈ విషయంలో ఆందోళన చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నామని, అయితే సినిమా షూటింగులు ఆగిపోతే వర్కర్లు, థియేటర్ల యజమానులు నష్టపోతారనే ఉద్దేశ్యంతోనే ఇంతకాలం ఓపిక పట్టామని, ఇక తమ వల్ల కాదని సి.కళ్యాణ్ తెలిపారు.

ఇండస్ట్రీలోనే దొంగలున్నారు
క్యూబ్, యూఎఫ్ఓ సమస్య చాలా కాలంగా పరిష్కారం కాక పోవడానికి కారణం ఇండస్ట్రీ వారే అని, ఇండస్ట్రీలోనే దొంగలున్నారని ఈ సందర్బంగా సి కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

అందరికీ సమన్యాయం జరుగాలి
ఇండస్ట్రీలో ఐక్యత లేదని, ఎవరి వ్యాపారం వారు చేసుకుంటున్నారు. ఇతరులకు సమస్య వస్తే పట్టించుకోవడం లేదు. ఎవరి వ్యాపారం వారు చేసుకుంటున్నపుడు అందరికీ సమ న్యాయం జరగాలనే ఈ పోరాటానికి శ్రీకారం చుట్టినట్లు సి.కళ్యాణ్ తెలిపారు.

నైజాంలో ఆ ముగ్గురూ...
నైజాం ప్రాంతంలో ముగ్గురు బలమైన డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారని, వారి చేతుల్లో థియేటర్లు ఉండటం వల్ల ఇతరులు సినిమా కొనకుండా చేస్తున్నారని, వారిని కాదని కొంటే విడుదల చేయడానికి థియేటర్లు లేకుండా చేస్తారని..... ఇండస్ట్రీలో ఉన్న చాలా సమస్యలకు వీరే కారణమని తెలిపారు.

సినిమా ఎలా తీస్తారో చూస్తాం
మార్చి 1 నుండి ప్రారంభం అయ్యే ఇండస్ట్రీ షట్ డౌన్‌లో సినిమా కార్మికులు, టెక్నిషియన్లు అందరూ పాల్గొంటున్నారని.... ఇండస్ట్రీలో సమస్యల పరిష్కారానికి మొగ్గుచూపని హీరోలు వారి సినిమాలు ఎలా తీసుకుంటారో చూస్తాం, కష్టాలంటే ఏమిటో వారికి ఇపుడు అర్థం అవుతాయని తెలిపారు.

సమస్య పరిష్కారం అయ్యే వరకు తగ్గబోము
ఈ సారి తమ మసస్యలు పరిష్కారం అయ్యే వరకు వెనక్కి తగ్గబోమని, దీన్ని ఇలా వదిలేస్తే సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదని, అందుకే ఈ సారి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ విషయంలో కఠినంగా వ్యవహరించనుందని తెలిపారు.


Click it and Unblock the Notifications











