‘రచ్చ’ థియేటర్లో ప్రమాదం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'రచ్చ' చిత్రం ప్రదర్శితం అవుతున్న థియేటర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. వరంగల్ జిల్లా కాజీపేటలోని భవాని థియేటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో థియేటర్లోని స్క్రీన్, కుర్చీలు దగ్ధం అయ్యాయి. షాట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరుగలేదు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పి వేశారు. ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యానికి భారీగా ఆస్థి నష్టం ఎదుర్కొంది.
వేసవి కావడంతో అగ్ని ప్రమాదాలకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. భవానీ థియేటర్ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని థియేటర్లను అధికారులు అప్రమత్తం చేశారు. థియేటర్లలోని అగ్ని మాపక పరికరాలు సరిగా పని చేస్తున్నాయో లేదో సరిచూసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు.
అగ్ని ప్రమాద నిరోదక వ్యవస్థ లేని థియేటర్లపైనా అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రమాణాలు పాటించని థియేటర్లపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధం అవుతున్నారు. గతంలో దేశంలో జరిగిన పలు థియేటర్ల అగ్నిమాదక ఘటనల్లో భారీగా ప్రాణ నష్టం జరిగిన నేపథ్యంలో అధికారులు థియేటర్లలో పాటించే ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
చరణ్ నటించిన 'రచ్చ' చిత్రం ఈ నెల 5వ తేదీన విడుదలై 11వ తేదీతో విజయవంతంగా వారం రోజులు పూర్తి చేసుకుంది. తొలి వారం ఈ చిత్రం 26.92 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చరణ్ సరసన తమన్నానటించింది. ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బేనర్ పై నిర్మించారు.


Click it and Unblock the Notifications











