బి.వియస్ రవి 'సెకండ్ హ్యాండ్' ఫస్ట్ లుక్ ఇదే
హైదరాబాద్ : రచయిత,దర్శకుడు బి.వియస్ రవి నిర్మాతగా మారి ఓ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం టైటిల్ పేరు 'సెకండ్‌హ్యాండ్'. తన స్నేహితుడు పూర్ణ తో కలిసి ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఓ రొమాంటిక్ సెటైర్ అని చెప్తున్నారు. ఇద్దురు అబ్బాయిలు,ఒక అమ్మాయి మధ్య జరిగే కథ అని చెప్తున్నారు.
ఈ సినిమా ద్వారా కిషోర్ తుమ్మల దర్శకుడుగా మారుతున్నారు. లో బడ్జెట్ లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి అశోశియేట్ గా పనిచేసిన రవి చంద్ర అందిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ భూత్ రిటర్న్స్, అబ్ తక్ చప్పన్ 2 చిత్రాల కెమెరామెన్ అవనీంద్ర ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. పూరి చిత్రాలకు ఎడిటర్ గా చేసే ఎస్.ఆర్ శేఖర్ ఈ చిత్రానికి ఎడిటర్ గా చేస్తున్నారు. కొత్త తరహా కాన్సెప్టు తో రూపొందే ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
మరో ప్రక్క దగ్గుపాటి రానా కోసం బివిఎస్ రవి పవర్ ఫుల్ స్క్రిప్టు రెడీ చేస్తున్నాడని, ఆ సినిమాకు తానే దర్శకత్వం వహించాలనే యోచనలో ఉన్నాడని టాక్. ఇందులో రాణాను పోలీస్ ఆఫీసర్‌గా చూపెట్టనున్నట్లు, భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈచిత్రం ప్లాన్ చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. బివిఎస్ రవి వివాదాల్లో ఇరుకున్న 'దేనికైనా రెడీ' , 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రాలతో పాటు, కింగ్, సత్యం లాంటి చిత్రాలకు స్క్రిప్టు మరియు డైలాగ్ రైటర్‍గా పని చేసారు.
ఇక బివియస్ రవి గత కొంతకాలంగా పూరీ జగన్నాధ్ వద్ద రచయితగా పనిచేస్తున్నారు. ఆయన దేముడు చేసిన మనుష్యులు చిత్రానికి కూడా రవి పని చేసారు. అలాగే గతంలో రవి దర్శకుడుగా మారి గోపీచంద్ హీరోగా వాంటెడ్ చిత్రం రూపొందించారు. అయితే ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం రాధామోహన్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా రూపొందుతున్న గౌరవం చిత్రానికి రైటర్ గా చేస్తున్నారు. వచ్చే సంవత్సరం మరో చిత్రం డైరక్షన్ చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications












