సినీ పరిశ్రమలో ఆ ఐదు కుటుంబాలదే ఆధిపత్యమా?
తెలుగు సినీ పరిశ్రమలో ఆ ఐదు కుటుంబాలదే ఆధిపత్యం సాగుతోందని, పరిస్థితి ఇలానే కొనసాగితే సాంస్కృతిక విప్లవానికి దారి తీస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. ప్రజలకు స్వేచ్ఛ లేకుండా హీరో నుంచి దర్శకుడు సహా సినిమా థియేటర్ల దాకా వాళ్ల చేతుల్లోనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇంకెన్నాళ్లు' సినిమాకు థియేటర్లు కేటాయించకుండా ఆయా వ్యక్తులు అడ్డుకుంటున్నారని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఈ చిత్రంలో చక్కగా చూపించారని, ఇలాంటి సినిమాలను అడ్డుకోవడం భావ్యం కాదన్నారు.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా నిన్న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ...ఒక్కొక్కరు నూరు, నూటయాభై థియేటర్లు గుప్పిట్లో పెట్టుకుని తెలంగాణ సినిమాలు ఆడనివ్వడం లేదని, మా సినిమాలు ఆడనివ్వక పోతే ఎవరి సినిమాలు ఆడటానికి వీల్లేదు, థియేటర్లు ఎగిరిపోతయ్ అంటూ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజకీయ నాయకులు సినిమా రంగంపై దృష్టి సారించడం, తెలంగాణ ఉద్యమం వేడెక్కుతున్న తరుణంలో సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల దర్శక నిర్మాతలు, హీరోలు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











