మాస్ కాదు కొత్తదనం కోసం పరితపించే పవన్ కళ్యాణ్...!
పదిహేనేళ్ల క్రితం చిరంజీవి తమ్ముడుగా వెండితెరకు పరిచయమైనప్పటికీ, అనతికాలంలోనే ఆర్టిస్టుగా పవన్ కల్యాణ్ తనదైన ముద్రను వేయగలిగాడు. అందుకు అతను ఎంచుకున్న మార్గం కొత్తదనం. పాతను తీసి పక్కన పెట్టడం... కొత్తకు బాటలు వేయడం. అందులో తొలి ప్రయత్నం తొలిప్రేమ! అప్పటి వరకు తెలుగులో మూస సినిమాలే వస్తున్న తరుణంలో 'తొలి ప్రేమ' సినిమా ద్వారా కల్యాణ్ ప్రేక్షకులకు కొత్తదనాన్ని రుచిచూపించాడు.
యాక్టింగ్ లో, బాడీ లాంగ్వేజ్ లో, డైలాగ్ డెలివరీలో... అన్నిటిలోనూ కొత్త స్టయిల్ ఆవిష్కరించాడు. యువతకు అది బాగా ఎక్కేసింది. ఆ తర్వాత 'తమ్ముడు'! కుర్రాళ్లు ఏం కోరుకుంటారో అవన్నీ అందులో చూపించాడు. ఆ సినిమాకు యువత బ్రహ్మరధం పట్టారు. తర్వాత బద్రీ... ఆ తర్వాత ఖుషీ... ప్రేక్షకులను అలరించడంలో వేటికవే పోటీపడ్డాయి. యూత్ అంతా పవన్ సినిమాలంటే అదో మత్తులో పడిపోయింది.
అతని సినిమాల కోసం ఎదురుచూడడం మొదలెట్టారు. అయితే విచిత్రంగా, ఆ తర్వాత పవన్ నుంచి మళ్లీ ప్రేక్షకులు ఆశించే సినిమా రావడం లేదు. సినిమాలు చేస్తున్నాడు కానీ... గతంలో అతని సినిమాలలో వున్న కిక్ మళ్లీ కనిపించడంలేదు. ఎక్కడో ఏదో మిస్ అవుతోంది. మొన్న 'పులి'... నిన్న 'తీన్ మార్'... ఊహూ... అభిమానులకు నచ్చడంలేదు. పవన్ నుంచి వాళ్లు ఏదో ఆశిస్తున్నారు... మరేదో వస్తోంది! అయినా... అభిమానులు ఇంకా ఆశతోనే వున్నారు... తాము కోరుకునే సినిమా పవన్ నుంచి త్వరలోనే వస్తుందని. అది ప్రస్తుతం చేస్తున్న షాడో (వర్కింగ్ టైటిల్) రూపంలో రావాలని కోరుకుంటున్నారు.
ఇన్నాళ్లూ ఏడాదికో సినిమా చొప్పున చేస్తున్న పవన్... ఇప్పుడు మిగతా హీరోలలా ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. త్వరలో 'గబ్బర్ సింగ్' ప్రారంభం కానుంది. ఆ తర్వాత మరి కొన్ని ప్లానింగ్ లో వున్నాయి. ఏమైనా, త్వరలో పవన్ కల్యాణ్ ఓ మంచి హిట్ సినిమాతో ప్రేక్షకులను అలరిస్తాడని ఆశిస్తూ... ఈ బర్త్ డే సందర్భంగా పవర్ స్టార్ కు దట్స్ తెలుగు తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది...


Click it and Unblock the Notifications











