ఏం చేసుకుంటావో చేస్కో.. నేను మాత్రం చేయను.. డైరెక్టర్‌తో అఖిల్!
అక్కినేని అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ కు ఇది మూడవ చిత్రం. తొలి రెండు చిత్రాలు నిరాశ పరచడంతో అఖిల్ ఈ చిత్రంపై స్పెషల్ కేర్ తీసుకుని నటించాడు. వెంకీ అట్లూరి దర్శత్వం వహించిన ఈ చిత్రంపై సర్వత్రా పాజిటివ్ బజ్ నెలకొంది ఉంది. ఈ రొమాంటిక్ ప్రేమ కథలో అఖిల్ లవర్ బాయ్ గా కనిపిస్తున్నాడు. టీజర్, ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అఖిల్ జోరుగా ప్రచార కార్యక్రమాల్లో గడుపుతున్నాడు. నాగార్జునతో చేసిన స్పెషల్ చిట్ చాట్ లో అఖిల్ మిస్టర్ మజ్ను గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

అంత ధైర్యం ఏంటి
నాగార్జున మాట్లాడుతూ ఈ చిత్ర పోస్టర్ లో నువ్వు పంచె కట్టులో ఉండడం చూశాను. పంచె కట్టు అంటే మామూలు విషయం కాదు. నాకు తెలిసి నాన్నగారికి కుదిరినట్లు పంచె కట్టు ఇంకెవరికి కుదరదు. కానీ నువ్వు మూడో చిత్రంలోనే అంత ధైర్యం చేశావేంటి అంటూ నాగార్జున అఖిల్ ని ప్రశ్నించాడు. దీనికి అఖిల్ సరదాగా సమాధానం ఇచ్చాడు.

ఏం చేసుకుంటావో చేస్కో
దర్శకుడు వెంకీ వలనే నేను పంచె కట్టా. మొదట వద్దని చెప్పా. వెంకీ.. నేను పంచె కట్టులో డాన్స్ చేయను.. ఎం చేసుకుంటావో చేస్కో అని తేల్చి చెప్పేశా. కానీ వెంకీ ఎదో విధంగా మాటలతో మాయచేసి కన్విన్స్ చేస్తాడు. నన్ను కూడా అదే విధంగా ఒప్పించాడు అని అఖిల్ తెలిపాడు. కానీ పంచె కట్టులో నటించిన సీన్స్ నాకు చాలా బాగా నచ్చాయని అఖిల్ తెలిపాడు. తాతయ్యని, సోగ్గాడే చిన్నినాయనా లో మీ లుక్ చూసి ఈ సాహసం చేశానని అఖిల్ తెలిపాడు.

నా కుక్కలు జాగ్రత్త
ఇంట్లో ఉన్న నాకుక్కలపై, మీ అమ్మపై కోపంగా కనిపించావు ఎందుకు అని నాగార్జున అఖిల్ ని ప్రశ్నించాడు. నా కుక్కలు, నా భార్య జాగ్రత్త అని నాగ్ అనగా.. మీ కుక్కలు నా కుక్కలే.. మీ భార్య మా అమ్మ అని సరదాగా బదులిచ్చాడు. అసలు ఎందుకు కోపగించుకున్నానో అఖిల్ వివరించాడు. ఈ చిత్రంలో 8 ప్యాక్ బాడీ ట్రై చేశా. 8 ప్యాక్ కోసం రెండు నెలల పాటు జిమ్ లో కష్టపడుతూ డైటింగ్ చేశా అని అఖిల్ తెలిపాడు. ఆకలిగా ఉన్న సమయంలో కొంత కోపం వచ్చి ఉంటుందని అఖిల్ తెలిపాడు.

ప్లే బాయ్‌గా
అఖిల్ ఈ చిత్రంలో గర్ల్ ఫ్రెండ్స్ ని మార్చే ప్లే బాయ్ గా ఎంటర్ టైన్ చేయబోతున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ అందించిన సంగీతం ఇప్పటికే ఆకట్టుకుంటోంది. వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తనదైన శైలిలో రొమాంటిక్ లవ్ స్టోరీగా తీర్చిదిద్దాడు. రేపు విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకుల ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











