‘గబ్బర్‌సింగ్’ టీంలో పండగ ఆనందం కరువు!
గబ్బర్ సింగ్ యూనిట్ సభ్యుల్లో ఈ సారి పండగ ఆనందం లేకుండా పోయింది. దర్శక నిర్మాతలు సక్రాంతి పండగ సందర్భంగా షూటింగుకు ఎలాంటి బ్రేకు ఇవ్వక పోవడమే ఇందుకు కారణం. దీంతో పండగ పూట కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాల్సిన వారంతా చేసేది లేక షరా మామూలుగానే పండగ రోజు కూడా పనిలోనే మునిగి తేలాలని డిసైడ్ అయ్యారు. షూటింగ్ త్వరగా పూర్తి చేసి అనుకున్న సమయానికి సినిమా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట.
పవన్ కళ్యాణ్-శృతి హాసన్ జంటగా రూపొందుతున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈచిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. హిందీ సూపర్ హిట్ మూవీ 'దబాంగ్'కు ఈ సినిమా రీమేక్. ఇప్పటికి నాలుగు పాటలు రికార్డు చేశారు. వీటిలో ఇంట్రడక్షన్ సాంగును బాబా సెహల్ ఆలకించారు. గతంలో బాబా సెహగల్ జల్సా సినిమాలో ఆలకించిన 'కరో కరో జల్సా' పాట ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.
నాగినీడు, సుహాసిని, అలి, అభిమన్యు సింగ్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ముదుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమా పూర్తి చేసి ఏప్రిల్ 27 చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ తేదీ గతంలో పవన్ ఖుషీ సినిమా విడుదల డేట్ కావడంతో హిట్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అంతా ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications











