పెళ్లి చేసుకో.. పెళ్లి చేసుకో.. ఏంటిది, స్టార్ స్టేటస్ తలకు ఎక్కింది.. జెమిని కుమార్తె సంచలనం!
Recommended Video

మహానటి చిత్రం విడుదలై విజయపథంలో దూసుకుపోతోంది. లెజెండరీ నటి సావిత్రి జీవిత చరిత్రని దర్శకుడు నాగ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించారు. నాగ అశ్విన్ కు ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయి నటించింది. దుల్కర్ సల్మాన్ జెమినీ గణేశన్ పాత్రలో నటించారు. అద్భుతమైన వసూళ్లతో మహానటి చిత్రం దూసుకుపోతోంది. సావిత్రి జీవితాన్ని తెరకెక్కిస్తున్న నేపథ్యంలో నాగ అశ్విన్ లోతుగా అధ్యయనం చేసారు. సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి కుటుంబాన్ని సంప్రదించి కూడా కథని ప్రిపేర్ చేసుకున్నారు. తాజాగా మహానటి చిత్రంపై వివాదం మొదలైంది. జెమిని గణేశన్ పాత్ర విషయంలో ఆయన కుమార్తె కమల గణేశన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సావిత్రి రోల్ సూపర్
సావిత్రి చిత్రాన్ని తాను, తన సన్నిహితులు చూశామని కమల గణేశన్ అన్నారు. సావిత్రి పాత్ర సూపర్ గా ఉందని అన్నారు. సావిత్రి అమ్మ చాలా మంచి వారని, తమని సొంత బిడ్డల్లాగే చూసుకునేవారని కమల అన్నారు.

జెమినీ గణేశన్ పాత్ర
సావిత్రి పాత్ర బావుంది కానీ తన తండ్రి జెమినీ గణేశన్ పాత్రని చూపించిన విధానమే సరిగా లేదని అన్నారు. జెమినీ గణేశన్ జెంటిల్ మాన్ అని కమల అన్నారు.

పెళ్లి చేసుకో.. పెళ్లి చేసుకో..
ఈ చిత్రంలో జెమినీ గణేశన్ పెళ్లి చేసుకో అని సావిత్రి వెంట పడే విధంగా చూపించారని అన్నారు. జెమిని గణేశన్ ఆడవారిని వేధించే రకం కాదని ఆయన జెంటిల్ మాన్ అని కమల అన్నారు. నాన్నగారు చాలా అందగాడు.. చదువుకున్న వ్యక్తి.. ఆయన వెంటే ఆడవాళ్లు పడే వారు అని కమల అన్నారు.

ఆయనే పెద్ద స్టార్
తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్ కు వలే జెమినీగణేశన్ కూడా పెద్ద స్టార్ అని అన్నారు. సావిత్రి చిత్రం కనుక ఎక్కువగా ఆమె పాత్రే ఉంటుందని తెలుసు. కానీ ఆమె భర్త అయిన నాన్న గారిని తగినంత గౌరవ ప్రదంగా చూపించలేదని కమల అసంతృప్తి వ్యక్తం చేశారు.

సినిమా ఎలా తీస్తారు
సావిత్రి సినిమా తీయాలి అనుకున్నప్పుడు జెమిని గణేశన్ కుటుంబాన్ని, సన్నిహితులని కూడా సంప్రదించాల్సింది. సావిత్రి తరుపున వారిని మాత్రమే సంప్రదించి సినిమా ఎలా తీస్తారు. అన్ని విషయాలు వారికే తెలుస్తాయా అంటూ కమల ప్రశ్నించారు.

అన్ని నేర్పింది నాన్నగారే
సావిత్రమ్మకు తమిళం, ఇంగ్లీష్, డ్రైవింగ్ అన్ని నేర్పింది నాన్నగారే అని కమల అన్నారు. సావిత్రమ్మని నాన్నగారు చాలా బాగా చూసుకునే వారని ఆమె అన్నారు. నాన్నగారిని స్థాయిని తగ్గించేలా ఈ చిత్రంలో కొన్ని సన్నివేవాలు ఉన్నాయని అన్నారు.

స్టార్ స్టేటస్ తలకు ఎక్కింది
సావిత్రమ్మకు, నాన్నగారికి మధ్య విభేదాలు తలెత్తడానికి కారణం తనకు తెలుసు అన్నారు. సావిత్రమ్మకు స్టార్ స్టేటస్ తలకు ఎక్కిందని తెలిపారు. అందువలనే సినిమాలు నిర్మించవద్దని నాన్న చెబుతున్నా సావిత్రమ్మ వినిపించుకోలేదని అన్నారు.

మద్యానికి బానిస
నాన్న నుంచి విడిపోయాక సావిత్రమ్మ మద్యానికి బానిస అయ్యారని, ఆ తరువాత బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆమె తెలుసుకోలేకపోయారని కమల అన్నారు.


Click it and Unblock the Notifications











