ఎక్కడున్నా మన భాషా,మన వాళ్ళూ అనే మమకారం మరువకూడదంటూ ,ఎన్నారైలు తమ దైన శైలిలో స్పందిస్తున్నారు.తాజాగా అట్లాంటాలో నివసిస్తున్న తెలుగువారు ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావును ఘనంగా సన్మానించారు. మారుతీరావు రచించిన ఆత్మకథ, అమ్మ కడుపు చల్లగా పుస్తకాలను ఈ వేదిక మీదే మరోసారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తానేమీ గొప్పవాడిని కాదని, కానీ గొప్పగొప్పవారిని కలుసుకోవడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని గొల్లపూడి వినయంగా చెప్పుకొచ్చారు. మరోవైపు అట్లాంటా తెలుగు సంఘంలో సభ్యులైన ప్రవాసాంధ్రులు మాతృభాష కు ప్రాచూర్యం కల్పించడానికి కంకణం కట్టుకున్నారు. ఎమోరీ యూనివర్సిటీలో తెలుగు భాష బోధనకు సంబంధించి సరికొత్త ప్రయత్నం చేపట్టారు. ఇందుకోసం విరాళాలు కూడా సేకరించాలని తలపెట్టారు. దీన్ని పర్యవేక్షించడానికి కొంతమంది ప్రముఖులతో కమిటీ వేశారు. ఇందుకోసం ఏర్పాటైన ఓ సదస్సులో పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, రాళ్లబండి కవితా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ కార్యక్రమం తెలుగు భాష మీద ప్రవాసాంధ్రులకు ఉన్న ప్రేమను చాటింది. ఇక అక్కడి వారు అనేక సాహితీ సదస్సులు ఏర్పాటు చేస్తుంటారు. అందులో కొన్ని చిరస్మరణీయంగా నిలుస్తాయి. బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావును సన్మానించడానికి ఏర్పాటు చేసిన సదస్సు కూడా తమకు జీవితాంతం గుర్తుండి పోతుందని ప్రవాసాంధ్రులు ఆనందంతో చెబుతున్నారు.