అందరూ అంటూంటే గర్వంగా ఉంది: గోపీచంద్
హైదరాబాద్ : ''మీ సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉందని అంటుంటే గర్వంగా ఉంది. బడ్జెట్ ఎక్కువవుతుందని తెలిసినా ధైర్యం చేశారు నిర్మాత. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటితో ఇది నాకు రెండో సినిమా. ఎనిమిది నెలలు కూర్చుని ఈ కథని సిద్ధం చేశారాయన. ఎప్పుడూ ఈ సినిమా గురించే ఆలోచించేవారు'' అంటూ గోపీచంద్ ఆనందంతో చెప్పుకొచ్చారు. గోపీచంద్ హీరోగా నటించిన చిత్రం 'సాహసం'. తాప్సి హీరోయిన్ . ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సందర్బంగా ఇలా మాట్లాడారు.
అలాగే... ఒక్కరి వల్ల ఏ సినిమా ఆడదు. ప్రతి సినిమాకీ ఐదు మూల స్తంభాలుంటాయి. నిర్మాత, దర్శకుడు, ఛాయాగ్రాహకుడు, కళా దర్శకుడు, సంగీత దర్శకుడు... వీళ్లంతా కలిసి కష్టపడితేనే మంచి సినిమా బయటికొస్తుంది. యేడాదిన్నర కష్టం ఈ సినిమా. సాంకేతిక బృందం ఎంతగానో శ్రమించింది. యేడాదిన్నర విరామం తర్వాత వచ్చిన సినిమా ఇది. ఎలా స్వీకరిస్తారో అనే భయం ఉండేది. ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరు చూస్తుంటే మా నిరీక్షణకు తగ్గ ఫలితమే దక్కిందన్న ఆనందం కలుగుతోంది అని అన్నారు.
తాప్సి మాట్లాడుతూ ''సోలో హీరోయిన్ గా తొలి విజయమిది. మూడేళ్లుగా ఇలాంటి విజయం కోసం ఎదురు చూస్తున్నా. నాపై చిత్రబృందం ఎంతో నమ్మకం ఉంచింది. లడక్‌లో తీసిన సన్నివేశాల కోసం చాలా కష్టపడ్డాం. గుర్రాల మధ్య ఫైట్లు చేయడం ఓ కొత్త అనుభవం. గ్రాఫిక్స్‌లో కొన్ని సన్నివేశాలున్నాయి. లేనివి ఉన్నట్టుగా వూహించుకొని నటించడం ఓ పరీక్షలా అనిపించింది'' అని చెప్పింది.
అనంతశ్రీరామ్ మాట్లాడుతూ ''ఇలాంటి సినిమాలకి పాటలు రాయడం ఓ సాహసం. ప్రేమకథల్లో ఎలాగైనా పాటలు రాయచ్చు. ఇది సాంకేతిక నిపుణుల హవా ఎక్కువగా ఉన్న కథ. ఇలాంటి సినిమాలో కూడా మూడు పాటలు రాసే అవకాశం వచ్చింది''అన్నారు. ''మా నమ్మకాన్ని ప్రేక్షకులు నిలబెట్టారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు'' అన్నారు నిర్మాత.


Click it and Unblock the Notifications











