హిందీ కామెడీ హీరో గోవిందాకు బెయిల్
దాడి కేసులో బాలీవుడ్ హాస్య నటుడు గోవిందాకు బెయిల్ మంజూరైంది. ఈ కేసుకు సంబంధించి సమన్లు జారీ కావడంతో గోవిందా తొలిసారిగా ముంబైలోని బోరివలిలోని మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. 15 వేల రూపాయల వ్యక్తిగత బాండ్ కానీ లేదా పది వేల రూపాయల నగదు కానీ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. గోవిందా పది వేల రూపాయల నగదు చెల్లించి బెయిల్ పొందారు. కాగా 2008లో 'మనీ హైతో హనీ హై' అనే సినిమా షూటింగ్ జరుగుతుండగా గోవిందా ఒకరి చెంప ఛెళ్లుమనిపించాడు.
బాధితుడు సంతోష్ రాయ్ ఫిర్యాదుమేరకు పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. క్రితం సంవత్సరం సెప్టెంబర్ 17న కోర్టుకు హాజరు కావాలని కోర్టు సమన్లు పంపించింది. అయితే గోవిందా అప్పుడు హాజరు కాలేదు. దాంతో కోర్టు ఆయన్ని హెచ్చరిస్తూ.. ఈ సారి కనుక కోర్టుకు రాకపోతే నాన్ బెయిల్ బుల్ వారెంట్ ఇష్యూ చేయవలసి వస్తుందని చెప్పింది. ఈ నేపధ్యంలో గోవిందా కోర్టుకు హాజరయ్యారు. ఇక ప్రస్తుతం గోవిందా కెరీర్ చాలా స్లోగా నడుస్తోంది. ఆయన చేతిలో పెద్దగా సినిమాలు లేవు. మణిరత్నం రావణ్, నాటి ఎట్ పార్టీ చిత్రాల ప్లాప్ తో ఆయన జోరు పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం లూట్, రన్ భోలా రన్ చిత్రాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












