రష్యా లోనూ అమితాబ్ కే ప్రథమ స్థానం!
న్యూఢిల్లీ : రష్యాకు చెందిన మ్యాగజైన్ ఈస్ట్రన్ ఐ నిర్వహించిన అభిప్రాయ సేకరణలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు నం.1 స్థానం దక్కింది. 100 మంది ప్రముఖ బాలీవుడ్ దిగ్గజాల మధ్య ఆయన సాటిలేని వ్యక్తిగా నిలిచారు. ఓట్లు, బాక్సాఫీసు, సినీపరమైన ప్రభావం తదితరాలతో కూడిన ఈ రకమైన ఎన్నికల్లో అమితాబ్ ప్రథమ స్థానం దక్కించుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఖాన్‌లు రాజ్యమేలుతున్నా బిగ్ బీనే ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
అమితాబ్ ... కెరీర్‌లో నిరాశాజనకమైన రోజులు ఉన్నప్పటికీ ఆయన సాధించిన విజయాలకి ఎప్పుడూ ఆయన అభిమానుల మద్దతు ఉంటుంది. 'ప్రేక్షకుల ప్రేమాభిమానాలే ఈనాడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయని' ప్రతీ సందర్భంలో ఆయన నిజాయితీగా, వినయంగా చెబుతారు. ఈ ఎన్నికల్లో మహిళల్లో అత్యంత ఉత్తమమైన నాలుగో స్థానం మాధురీ దీక్షిత్‌కి దక్కింది.
ఇక రంజాన్ పండుగ పురస్కరించుకుని మన్నత్ నివాసంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్న అమితాబ్ బచ్చన్ షారుక్ ఖాన్ సర్రోగసి బేబి అబ్ రామ్ ని కలిశాడు. మే 27న అబ్ రామ్ జన్మించిన సంగతి తెలిసిందే. అబ్ రామ్ ఆరోగ్యం సరిగా లేని కారణంగా మీడియాకు ఇతరులకు దూరంగా ఉంచారు. అబ్ రామ్ సూపర్. చాలా బాగున్నాడు. ముద్దొచ్చాడు అని ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఈద్ పార్టీకి బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
అమితాబ్ బచ్చన్ తన తదుపరి చిత్రం 'మెహరున్నీసా' షూటింగ్ కోసం లక్నో వెళ్లనున్నారు. సుధీర్ మిశ్రా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ నటిస్తున్నారు. రంజాన్ తర్వాత ఈ షూటింగ్ జరుగుతుందని చిత్ర వర్గాలు తెలిపాయి. చౌక్ ప్రాంతంలో ఈ షూటింగ్ కోసం ఓ భారీ స్టేజి ఏర్పాటుచేశారు. ఈ చిత్రంలో అమితాబ్తో పాటు రిషికపూర్, చిత్రాంగద సింగ్ లాంటి ప్రముఖ నటులు కనిపిస్తారు. చౌక్, బడా ఇమాంబాడ, లా మాట్రినెర్ బాయెస్ కాలేజి, కాల్విన్ తాలూక్దార్ కాలేజి తదితర ప్రాంతాల్లో షూటింగ్ కోసం ఇప్పటికే అనుమతులు తీసుకున్నారు.
నాలుగు దశాబ్దాల తర్వాత కలిసే ఇద్దరు స్నేహితుల కథే ఈ చిత్ర ప్రధానాంశం. 1996లో దీనికి సంబంధించిన స్క్రిప్టును సుధీర్ మిశ్రా రాసుకున్నారు. వీరిద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించి, తర్వాత విడిపోతారు. వీళ్లిద్దరూ ప్రేమించిన మహిళ పాత్రను చిత్రాంగద పోషిస్తున్నారు. వాళ్లిద్దరికీ 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఆమె వీరి జీవితంలో మళ్లీ ప్రవేశిస్తుంది. సినిమా కథ 1945లో ప్రారంభమై నాలుగు దశాబ్దాలు నడుస్తుంది. దర్శకుడు సుధీర్ మిశ్రా కూడా లక్నో వాసే. ఈ చిత్ర నిర్మాత నిఖిల్ అద్వానీ.


Click it and Unblock the Notifications












