సినీ ప్రియులకు పండగ లాంటి వార్త: దేశంలోని అన్ని థియేటర్లలో రేట్లు తగ్గింపు
ఇండియాలో క్రికెట్ తర్వాత అంతగా ఆదరణ లభించేది సినీ రంగానికి మాత్రమేనన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిగిలిన దేశాలతో పోలిస్తే ఇక్కడ మాత్రమే సినిమాల విడుదలను పండుగలా జరుపుకుంటుంటారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఈ మధ్య కాలంలో థియేటర్ల యాజమాన్యాలు ఎన్నో ప్లాన్లు చేస్తున్నాయి. ముఖ్యంగా సినిమా హాళ్లు, మల్టీఫ్లెక్స్‌ల్లో లభించే పాప్‌కార్న్, పానియాలు, ఇతర ఆహార పదార్థాలపై భారీగా ధరలను పెంచేసి డబ్బు సంపాదిస్తున్నాయి. దీంతో సినిమా మనుగడపైన కూడా నీలినీడలు కమ్ముకున్నాయని చెప్పాలి.
థియేటర్లలో లభించే ఆహార పదార్థాలపై వస్తు సేవల పన్ను (GST) 18 శాతం వరకూ పన్ను విధించింది. దీనికితోడు హాళ్లలో వీటి రేట్లను ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు థియేటర్లలో లభించే పాప్‌కార్న్, బేవరేజెస్‌పై పన్ను శాతం తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్‌కు ప్రతిపాదనలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సమగ్రంగా విచారణ జరిపిన కౌన్సిల్ సభ్యులు మంగళవారం జరిగిన 50వ సమావేశంలో పన్ను శాతాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి వరకూ ఇండియాలోని అన్ని సినిమా హాళ్లు, మల్టీఫ్లెక్స్‌ల్లో పాప్‌కార్న్, బేవరేజెస్‌పై 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు 5 శాతానికే తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన రాష్ట్ర ఆర్థిక మంత్రులతో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. ఈ విషయాన్ని వస్తు సేవల పన్ను సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అయితే, వీటిపై కొత్త జీఎస్టీ ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది అన్న దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

జీఎస్టీ కౌన్సిల్ 50వ సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా మీడియాతో మాట్లాడారు. 'సినిమా హాళ్లలో వినియోగించే ఆహారం, పానీయాలపై 18 శాతం కాకుండా 5 శాతం జీఎస్‌టీ ఉంటుందని కౌన్సిల్ ఈరోజు స్పష్టం చేసింది. త్వరలోనే దీనిపై మరింత సమాచారం అందిస్తాం' అంటూ ఆయన చెప్పుకొచ్చారు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులపై చాలా వరకూ భారం తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇది నిజంగా సినిమాను ప్రేమించే వాళ్లకు పండుగ లాంటి వార్త అని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











