‘ఊకొడతారా....' పాటే ఆ సినిమా ట్రైలర్ కూడా?
హైదరాబాద్: బాలకృష్ణ అతిధిపాత్రలో రూపొందిన చిత్రం 'ఊకొడతారా..ఉలిక్కి పడతారా' ఈ నెల 27న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో పాటు మంచు లక్ష్మి నిర్మిస్తున్న మరో చిత్రం గుండెల్లో గోదారి చిత్రం ట్రైలర్ ను కూడా విడుదల చేస్తున్నారు. మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం 'గుండెల్లో గోదారి'. ఆది పినిశెట్టి, తాప్సీ, లక్ష్మీ ప్రసన్న ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. నాగేంద్రకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లక్ష్మీప్రసన్న నిర్మిస్తున్నారు.
ప్రేమకథతో కూడిన చక్కటి కుటుంబ కథా చిత్రంగా నిర్మిస్తున్నట్లు నిర్మాత తెలియజేశారు. ఇప్పటికి 70 శాతం షూటింగ్ పూర్తయిందనీ, కథరీత్యా అధికభాగం గోదావరి పరివాహక ప్రాంతాల్లోనే షూటింగ్ జరిపామనీ ఆమె తెలిపారు. అన్ని కమర్షియల్ అంశాలతో రూపొందిన చక్కటి గోదావరి గలల సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనీ తెలిపారు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని జూన్‌లో చిత్రాన్ని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నామనీ చెప్పారు.
'ఊకొడతారా..ఉలిక్కి పడతారా' విషయానికి వస్తే...భారీ బడ్జెట్ తో రూపొందిందని,సుమారు ఆరు కోట్ల రూపాయలు కేవలం చిత్రంలోని గంధర్వ మహల్ సెట్ కే ఖర్చు పెట్టామని చెప్తున్న నేఫధ్యంలో ఈ సినిమాకి బడ్జెట్ ఎంతై ఉంటుందనే చర్చ ప్రారంభమైంది. ఈ చిత్రానికి 23కోట్లు ఖర్చైందని విశ్వసనీయ సమాచారం. ఇక ఈ చిత్రం బాలకృష్ణకు బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని చెప్తున్నారు. ఇక ఇప్పటికే 'ఊకొడతారా..ఉలిక్కి పడతారా'ట్రైలర్స్ రిలీజై మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. మంచు ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై పద్మశ్రీ డా.ఎం. మోహన్ బాబు సమర్పణలో మంచు మనోజ్, దీక్షాసేత్ హీరో హీరోయిన్లుగా శేఖర్ రాజా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.
దర్శకుడు శేఖర్ రాజా చెప్పిన పాత్రలోని ఉదాత్తతకు ఆకర్షితులై 'ఊ కొడతారా..ఉలిక్కిపడతారా'లో నటించడానికి నందమూరి బాలకృష్ణ అంగీకరించారు. గత నెలలో ఈ చిత్రం ఆడియో విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. మంచు మనోజ్ మాట్లాడుతూ..'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' 27వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. నాలుగేళ్ల మా టీమ్ కల నిజమవుతోంది. మా టీమ్ ని ఎంకరేజ్ చేయండి అని ట్వీట్ చేసారు. అలాగే మా సినిమా కు విపరీతమైన క్రేజ్ రావటంతో డిస్ట్రిబ్యూటర్స్ ప్రింట్స్ పెంచమని అడుగుతున్నారు అన్నారు. ఇది ప్రింట్స్ పెంచటం అనేది పూర్తిగా డిస్ట్రిబ్యూటర్స్ ఛాయిస్ అని మంచు మనోజ్ ఈ సందర్భంగా చెప్పారు.


Click it and Unblock the Notifications











