Sakranti Releases ‘అన్నీ స్క్రీన్లు గుంటూరు కారం మూవీకే.. ఏ ఒక్క థియేటర్ ఆ సినిమాలకు వెళ్లవు’
తెలుగు సినిమా పరిశ్రమలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో రిలీజ్ అవుతున్న సినిమాల విషయంలో తీవ్రమైన పోటీ నెలకొన్నది. అయితే దాదాపు 5 సినిమాలు విడుదల అవుతున్న నేపథ్యంలో స్క్రీన్ల కేటాయింపు విషయంలో ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి సినిమాల విడుదల విషయంపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతున్నది. అయితే తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు కారం సినిమాకు 75 శాతానికిపైగా స్క్రీన్లు కేటాయించడంపై ఇతర సినిమా నిర్మాతలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్టు సమాచారం. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..
నైజాంలో దాదాపు అత్యధిక శాతం థియేటర్లలో గుంటూరు కారం సినిమాను రిలీజ్ చేయడానికి డిస్టిబ్యూటర్ దిల్ రాజు తనదైన శైలిలో అధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారనేది మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఇక హైదరాబాద్‌లో 96 థియేటర్లు ఉంటే.. దాదాపు 90 థియేటర్లలో గుంటూరు కారం సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

ఇదిలా ఉండగా, ఏపీలోని అన్ని ప్రాంతాల్లో గుంటూరు కారం సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. డీ సురేష్ బాబు చేతిలో ఉన్న థియేటర్లలో సైంధవ, అలాగే మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్న హనుమాన్ సినిమాకు కొన్ని థియేటర్లు కేటాయించారు. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ చేతిలో ఉన్న థియేటర్లలో నా సామిరంగ అధిక మోతాదులో రిలీజ్ చేస్తున్నారు. ఇక రవితేజ ఈగిల్ సినిమాకు ఇంకా స్క్రీన్ల కేటాయింపు జరగకపోవడం మరో వివాదంగా మారింది.

అయితే స్క్రీన్లు, రిలీజ్ విషయంలో ఇలాంటి టాక్ జరుగుతున్నప్పటికీ.. అఫీషియల్‌గా ఏ సినిమా ఎక్కడ రిలీజ్ చేస్తున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ గుంటూరు కారం నిర్మాత నాగవంశీ మాత్రం ఏపీ, నైజాంలోని దాదాపు అన్ని థియేటర్లలో గుంటూరు కారం సినిమానే పడుతుంది అని ఫ్యాన్స్‌కు భరోసా ఇస్తున్నారు.
గుంటూరు కారం సినిమాకు తప్ప మరో సినిమాకు థియేటర్లు ఇచ్చేది లేదు. కేవలం మన సినిమాకే అంతటా స్క్రీనింగ్ ఉంటుంది. నిర్మాతగా నేను మీకు భరోసా ఇస్తున్నాను. ఎవరు ఏమీ చెప్పినా నమ్మకండి. సినిమా బాగా వచ్చింది. ఈ సినిమాను ఫ్యాన్స్ నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాలి అని నిర్మాత క్లారిటీ ఇచ్చారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షి చౌదరీ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను చినబాబు, నాగవంశీ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











