ఠాగూర్ లాంటి మూవీకి గురిపెట్టి గబ్బర్‌సింగ్ డైరెక్టర్
హైదరాబాద్: త్వరలో తన తర్వాతి సినిమా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో చాగల్లు వినాయకుడి ఆలయంలో హరీష్ శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హరీష్ శంకర్ మాట్లాడుతూ సినిమా ప్రారంభించే ముందు చాగల్లు వినాయకుడి ఆలయంలో పూజ చేయడం అలవాటుగా మారిందన్నారు. త్వరలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా సినిమా ప్రారంభించనున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో ఠాగూర్ లాంటి సందేశాత్మక చిత్రాలను తీయాలని ఉందని, అలాంటి సినిమా తీయడమే తన లక్ష్యమన్నారు.
హరీష్ శంకర్ తీయబోయే సినిమా వివరాల్లోకి వెళితే...
'గబ్బర్‌సింగ్' చిత్రంతో ఘన విజయం సాధించిన హరీష్ శంకర్ మరోమారు అదే తరహా వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు . 'సింహా' వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన పరుచూరి ప్రసాద్ నిర్మాణంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో మెగా కాంపౌండ్‌కి చెందిన సాయి ధరమ్ తేజ హీరోగా నటిస్తారు.

నిర్మాత మాట్లాడుతూ ''వినోదం, వాణిజ్య అంశాల్ని కలగలిపి హరీష్‌శంకర్ ఓ కథని సిద్ధం చేసుకున్నారు. ఆయన గత చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా ఇందులో వినోదం పండబోతోంది. త్వరలో పూర్తి వివరాల్ని ప్రకటిస్తాం'' అన్నారు.
గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ చిత్రం అందించిన హరీష్ శంకర్ వెను వెంటనే రామయ్యా వస్తావయ్యా అంటూ డిజాస్టర్ ఇచ్చారు. దీని తర్వాత రవి తేజ, అల్లు అర్జున్, సునీల్‌లతో సినిమాలు చేస్తాడనే వార్తలు వినిపించాయి.అయితే అవేమీ మెటీరియలైజ్ కాలేదు. దాంతో ఇప్పుడు మార్కెట్లో క్రేజ్ గా ఉన్న సాయి ధరమ్ తేజ తో ఆయన చిత్రం మొదలెట్టబోతున్నారు. ఈ చిత్రంతో తప్పకుండా హిట్ కొడతాననే ధీమాగా ఉన్నారు హరీష్ శంకర్.


Click it and Unblock the Notifications











